ATM Theft: మహారాష్ట్రలో ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకుపోయిన దొంగలు

ATM unit with 10L in cash stolen from Nashik Road of maharashtra
  • నాసిక్ లో ఘటన.. సీసీటీవీ కెమెరాలో రికార్డు  
  • లారీలో వచ్చి మెషిన్ ను ఎత్తుకెళ్లిన వైనం
  • సమీపంలోనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నా వెరవని దొంగలు
మహారాష్ట్రలోని నాసిక్ లో కొంతమంది దొంగలు ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లారు. దర్జాగా లారీ తీసుకొచ్చి, మెషిన్ ను అందులోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఈ ఏటీఎం ఉన్న చోటుకు కూతవేటు దూరంలోనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉండడం గమనార్హం. నిత్యం పోలీసులు, అధికారులు ఈ ఏటిఎంలో డబ్బులు తీసుకునేందుకు వస్తుంటారని, అలాంటి చోటుకు వచ్చి మెషిన్ నే ఎత్తుకెళ్లారని తెలిసి నమ్మలేకపోయామని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కానీ విషయం బయటకు రాలేదు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఆదివారం తెల్లవారుజామున నలుగురు దుండగులు ఏటీఎంలోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. ముఖాలు కనిపించకుండా మాస్క్ లు వేసుకుని, రెయిన్ కోట్లు ధరించి ఏటీఎం మెషిన్ ను తెరిచేందుకు విఫల యత్నం చేశారు. ఆపై తమ వెంట తెచ్చుకున్న లారీలోకి ఏటీఎం మెషిన్ ను ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. మరుసటి రోజు ఉదయం ఏటీఎం సెంటర్ లో మెషిన్ లేకపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీల ఫుటేజ్‌ని సేకరించి, విజువల్స్‌ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ATM Theft
Nashik Road
Maharashtra
offbeat

More Telugu News