Telangana: రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ కు ఏడుపు ఎందుకు?: జగదీశ్ రెడ్డి

  • పీసీసీ చీఫ్ పై మండిపడ్డ తెలంగాణ మంత్రి
  • రాష్ట్రంలోని రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని విమర్శ
  • దేశంలో వ్యవసాయాన్ని ఆ పార్టీ నాశనం చేసిందని ఫైర్
Minister Jagadeesh Reddy press meet

తెలంగాణ రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తే రేవంత్ రెడ్డికి ఏడుపు ఎందుకని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై మీకు, మీ పార్టీకి కక్ష ఎందుకని రేవంత్ రెడ్డిని నిలదీశారు. అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ఆరోపించారు. రైతులు బాగుపడుతుంటే ఆ పార్టీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు సూచన అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ విధానాలపై, రైతు వ్యతిరేక ధోరణిపై ఆలోచన చేయాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు ఓటేయాలని భావించే రైతులు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. రేవంత్ వ్యాఖ్యలు ఆషామాషీగా చేసినవి కావని హెచ్చరించారు. తాను ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ అనుమతితోనే మాట్లాడతానని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయడం ఖాయమనేందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.

More Telugu News