Telangana: కనికరించని నైరుతి.. తెలంగాణ వర్షపాతంలో 30 శాతం లోటు!

  • తెలంగాణలో 23 జిల్లాల్లో కానరాని వానలు
  • పలు జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతం నమోదు
  • సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలకే వానలు పరిమితం
  • అప్రమత్తమైన ప్రభుత్వం, కరవు ఏర్పడితే ఏం చేయాలనే దానిపై కసరత్తు
Telangana witness 30 percent rainfall deficit

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో కలకలం రేగుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో కరవు పరిస్థితి దాపురిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో, అప్రమత్తమైన అధికారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు ప్రారంభించారు. 

సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈమారు ఏకంగా మూడో వారంలో ఎంట్రీ ఇచ్చాయి. ఆ తరువాత కూడా నైరుతి విస్తరణ ఆశించిన స్థాయిలో లేక వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈపాటికి రాష్ట్ర వ్యాప్తంగా 19.19 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 13.49 సెంటీమీటర్ల మేర వానలు పడ్డాయి. ఫలితంగా, వర్షపాతంలో 30 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, మెదక్ వంటి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా అది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. మిగతా జిల్లాలో లోటు, అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. 

పరిస్థితులు కలవరం రేపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరవు పరిస్థితులు ఏర్పడితే ఏంచేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, సాగునీటితో పాటూ ఇతర శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అధికారులు రెండు మార్లు సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు.

More Telugu News