Prakasam District: ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన బస్సు..ఏడుగురి మృతి

  • ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో అర్ధరాత్రి సాగర్ కాలువలోకి దూసుకుపోయిన బస్సు
  • ప్రమాద సమయంలో బస్సులో  పెళ్లి బృందం
  • బస్సు కింద పడి చిన్నారి సహా ఏడుగురి మృతి
  • 15 మందికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స 
  • అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి
Bus falls into sagar canal in prakasam district seven passengers found dead

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలో పడిపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళుతుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చిన్నారి మృతదేహం బస్సు కింద చిక్కుకుపోయినట్టు గుర్తించారు. 

అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాలువ సమీపంలో స్పీడుగా వెళుతున్న బస్సు అదుపుతప్పి సైడ్ వాల్‌కు ఢీకొట్టి చివరకు కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వివాహం జరిగిన అనంతరం ఇతర కార్యక్రమాల కోసం వారు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ స్పందించారు. ‘‘తొలుత బస్సు కెనాల్ వాల్‌కు వేగంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడిపోయారు. చివరకు బస్సు కాలువలో పడిపోయింది. బస్సు కింద పడి నలిగి చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు’’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీజ్ (65) అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా(6) మృతి చెందారు.

More Telugu News