KCR: త్వరలో పాతబస్తీలోనూ పరుగులు పెట్టనున్న మెట్రో

  • ఎంజీబీఎస్-ఫలక్‌నుమా రూట్‌లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి
  • వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలంటూ మున్సిపల్, ఎల్ అండ్ టీ అధికారులకు స్పష్టీకరణ
  • ట్విట్టర్‌లో సీఎం నిర్ణయాన్ని వెల్లడించిన కేటీఆర్
KCR instructs to immediately resume metro project in mgbs falaknuma route

పాతబస్తీవాసులకు త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. మొట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. 

అయితే, పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మున్సిపల్ అధికారులు, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌తో మాట్లాడారు. మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు సీఎం చెప్పినట్టు కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమాతో పాటూ రాయదుర్గం రూట్‌లోని పలు ప్రాంతాల్లో 2.7 కిలోమీటర్ల మేర మిగిలిపోయిన నిర్మాణపనులను పూర్తి చేస్తే నగర వాసులకు పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

More Telugu News