Ghat Roads: తిరుమల ఘాట్ రోడ్లలో డేంజర్ జోన్ల గుర్తింపునకు టీటీడీ చర్యలు

  • గత నెలలో తిరుమల ఘాట్ రోడ్లలో పెద్ద సంఖ్యలో ప్రమాద ఘటనలు
  • టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం
  • శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్న ధర్మారెడ్డి
  • ప్రమాదాలపై వెంటనే స్పందించేందుకు యాక్షన్ టీమ్ ఏర్పాటు
TTD decides to identify danger zones on Tirumala ghat roads

తిరుమల ఘాట్ రోడ్లలో గత నెలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల టీటీడీ దృష్టి సారించింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి దీనిపై చర్చించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సహా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

దీనిపై ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే డేంజర్ జోన్లను గుర్తించి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. 

తిరుమల ఘాట్ రోడ్లపై ఎక్కడ ప్రమాదం జరిగినా సత్వరమే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఇక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండాలని ధర్మారెడ్డి సూచించారు. 

అంతేకాకుండా, తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేసే ధర్మ రథం బస్సులను రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో తిప్పాలని అధికారులకు నిర్దేశించారు.

More Telugu News