Nara Lokesh: బీసీ సంక్షేమ మంత్రిని చూస్తే జాలేస్తోంది: నారా లోకేశ్

  • నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పాదయాత్ర సందర్భంగా బీసీలతో సమావేశమైన లోకేశ్
  • బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శలు
  • జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని వ్యాఖ్యలు
  • ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని స్పష్టీకరణ
Lokesh says he is pity for state BC Welfare minister

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ బీసీలతో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక మంత్రి పేషీకి తాళం వేశారని ఎద్దేవా చేశారు. 

తాము అధికారంలోకి వస్తే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నిధులు కేటాయించి కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని, ఉప కులాల వారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. 

జగన్ పాలనలో ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని అన్నారు. టీడీపీ గెలిచాక సబ్సిడీతో విద్యుత్ అందిస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని జగన్ మోసం చేశారని, అధికారంలోకి రాగానే పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడంలేదని, తాము అధికారంలోకి వస్తే గొర్రెలు కొనడానికి రుణాలు అందిస్తామని, సబ్సిడీపై మందులు కూడా ఇస్తామని తెలిపారు. 

ఇక, మత్స్యకారులకు గత ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. జగన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వం అని లోకేశ్ అభివర్ణించారు. చంద్రబాబు ఒక విజనరీ అయితే, జగన్ ఒక ప్రిజనరీ అని ఎద్దేవా చేశారు. 

పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలనేది జగన్ రెడ్డి కోరిక అని విమర్శించారు. ఏపీ పేదరికం లేని రాష్ట్రంగా ఎదగాలనేదే టీడీపీ లక్ష్యం అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలంటే టీడీపీ గెలవాలని, చంద్రబాబు రావాలని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News