Rahul Gandhi: నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది... కానీ వినియోగించలేను: రాహుల్ గాంధీ

  • ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్‌ మెకానిక్‌లతో ఇటీవల ముచ్చటించిన రాహుల్
  • తన దగ్గర కేటీఎం బైక్‌ ఉన్నా... నడిపేందుకు భద్రతా సిబ్బంది అనుమతించరని వ్యాఖ్య
  • రాహుల్ యూట్యూబ్ చానల్‌లో వీడియో
rahul gandhis Bike Servicing with Super Mechanics of Karol Bagh

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గత నెలలో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్‌ మెకానిక్‌ షాపులను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి వర్కర్లతో ఆయన ముచ్చటించారు. వారితో కలిసి కొన్ని బైక్‌లను రిపేర్‌ చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశారు.

మెకానిక్‌లతో మాట్లాడుతున్న సందర్భంగా తన వద్ద ఉన్న బైక్‌ గురించీ రాహుల్‌ ప్రస్తావించారు. దాన్ని ఎందుకు బయటకు తీయరో కూడా వివరించారు. ‘‘నా దగ్గర కేటీఎం 390 బైక్‌ ఉంది. కానీ దాన్ని నేను వినియోగించను. దాన్ని నడిపేందుకు నా భద్రతా సిబ్బంది అనుమతించరు” అని అన్నారు. 

మెకానిక్‌ల సమస్యలను తెలుసుకునేందుకు తాను అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో ‘మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?’ అని మెకానిక్‌లు అడగ్గా... రాహుల్‌ స్పందించలేదు.

‘భారత్‌ జోడో యాత్ర’తో దేశవ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అది పూర్తయిన తర్వాత వివిధ వర్గాల వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ట్రక్కుల్లో ప్రయాణం, మెకానిక్‌ షెడ్‌లో ముచ్చట్లు వంటివి చేపడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుని, అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

More Telugu News