G. Kishan Reddy: 'ఫామ్ హౌస్ ఫ్యామిలీ' అంటూ ఘాటుగా విమర్శించిన కిషన్ రెడ్డి

  • తెలంగాణ, వరంగల్ అభివృద్ధి చెందితే బంగారు కుటుంబం ద్వేషిస్తోందని ఆగ్రహం
  • కాజీపేటలో రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రిపెయిరింగ్ షెడ్ అన్నారని ధ్వజం
  • కేసీఆర్ అబద్దాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రజలు గమనిస్తున్నారన్న కిషన్
Kishan Reddy says KCR family is farm house family

తెలంగాణ అభివృద్ధి చెందితే, వరంగల్ ప్రయోజనం పొందితే బంగారు కుటుంబం సభ్యులు ద్వేషిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి... కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. కాజీపేటలో నిర్మించనున్న రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రిపెయిరింగ్ షెడ్ అని వారు అన్నారని గుర్తు చేశారు. వివిధ ప్రాజెక్టుల ఖర్చును పెంచడానికి అలవాటుపడిన బీఆర్ఎస్ రిపెయిరింగ్ షెడ్ నిర్మించేందుకు రూ.521 కోట్లు ఖర్చు పెట్టడంలో సందేహం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అబద్దాలను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాజీపేటలో వ్యాగన్ల తయారీతో ప్రారంభించి, ఇతర అవసరాలకు వినియోగించనున్నట్లు చెప్పారు.

కేవలం వ్యాగన్ల తయారీ ద్వారానే రానున్న ఇరవై ఏళ్లలో రూ.30,000 కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోనుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాను చూసి ఫామ్ హౌస్ కుటుంబం తట్టుకోలేకపోతోందని విమర్శించారు. కాజీపేటలో రూ.521 కోట్లతో నిర్మిస్తున్న కొత్త రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.160 కోట్లు కేటాయించారని, 160 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. కానీ దీనిని ఫామ్ హౌస్ ఫ్యామిలీ అవమానకరంగా రిపెయిరింగ్ షెడ్ అని పిలుస్తోందని ధ్వజమెత్తారు. ఇక్కడ షెల్ అసెంబ్లీ షాప్, బాడీ షాప్, వీల్ షాప్, బోగీ షాప్, సీబీసీ షాప్, షీట్ మెటల్ షాప్, పెయింట్ షాప్, షవర్ టెస్ట్, స్టోర్ వార్డ్ తదితరాలు ఉంటాయని తెలిపారు. ఈ వాగన్ తయారీ పరిశ్రమ ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణలో 2 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించామని, దేశంలోనే మొదటి ఔటర్ రింగ్ రైలును తీసుకువస్తున్నామని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించడం, రైలు మార్గాల విస్తరణ, తెలంగాణలో రూ.35,000 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 1645 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుందన్నారు.

More Telugu News