Kanti Rana Tata: ధర్మవరం వస్త్రవ్యాపారులపై దాడి చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేశాం: విజయవాడ సీపీ

  • సరుకు సరఫరా చేసిన వస్త్ర వ్యాపారులపైనే దాడి
  • బట్టలూడదీసి కొట్టిన వైనం
  • విజయవాడ వ్యాపారి అవినాశ్ గుప్తా, నాగేశ్వరరావు అరెస్ట్
  • నిందితులు, బాధితులు ఏ పార్టీకి చెందినవారు కారన్న సీపీ
Vijayawada CP Kanti Rana Tata press meet

బట్టలు సరఫరా చేసి, ఆ మేరకు బాకీ తీర్చాలని అడిగిన ధర్మవరం వ్యాపారులను విజయవాడలో ఓ షోరూం యజమాని అవినాశ్ గుప్తా చితకబాదిన సంగతి తెలిసిందే. ఆ వ్యాపారుల బట్టలూడదీసి కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితుడు వైసీపీ నేత అంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. 

ఈ నేపథ్యంలో, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. ధర్మవరం వస్త్ర వ్యాపారులపై దాడి చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేశామని వెల్లడించారు. వస్త్ర వ్యాపారులపై దాడికి పాల్పడిన వారు అవినాశ్ గుప్తా, నాగేశ్వరరావు అని వివరించారు. 

ధర్మవరం వ్యాపారుల నుంచి అవినాశ్ గుప్తా రూ.2.34 లక్షల విలువైన సరుకు తీసుకున్నాడని తెలిపారు. ఆ వ్యాపారులకు అవినాశ్ గుప్తా ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని సీపీ పేర్కొన్నారు. తమకు రావాల్సిన డబ్బుపై వ్యాపారులు అవినాశ్ గుప్తాను నిలదీశారని, దాంతో అవినాశ్ గుప్తా వారిద్దరినీ నిర్బంధించాడని వెల్లడించారు. 

జూన్ 2న ఇద్దరు వ్యాపారులను ప్లాస్టిక్ పైపులతో కొట్టారని వివరించారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం లాక్కుని, రెండు గంటల పాటు బంధించారని సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. 

తెనాలి వాసి అవినాశ్ గుప్తా అనేక చోట్ల అప్పులు చేశాడని, ఆలయ సిల్క్స్ పేరుతో విజయవాడలో షోరూం తెరిచాడని పేర్కొన్నారు. నిందితులకు, బాధితులకు ఏ పార్టీతో సంబంధం లేదని సీపీ స్పష్టం చేశారు.

More Telugu News