Narsingi: నార్సింగి రోడ్డు ప్రమాద ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

  • స్నేహితుడి మాటలు విని కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపిన నిందితుడు
  • నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదన్న పోలీసులు
  • ప్రమాదం తర్వాత కారును వదిలేసి పరారైన నిందితులు
Shocking facts in Narsingh road accident incident

హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మంగళవారం తెల్లవారుజామున తల్లీకుమార్తె మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీ.. స్నేహితుడి చెప్పుడు మాటలు విని కారును వేగంగా నడిపిన విషయం వెలుగులోకి వచ్చింది. 

తెల్లవారుజామున రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ ఉండదని, కాబట్టి వేగంగా వెళ్తే ఆ మజానే వేరని స్నేహితుడు బనోత్ గణేశ్ చెప్పడంతో ఖాద్రీ చెలరేగిపోయాడు. యాక్సిలరేటర్‌పై తొక్కితే అదికాస్తా 120 కిలోమీటర్లకు చేరుకుంది. ఆ వేగంతో కారు నడపడంతో నియంత్రణ కోల్పోయి మార్నింగ్ వాక్‌కు వచ్చిన తల్లీకూతుళ్లను బలితీసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

స్నేహితుడు చెప్పడం వల్లే తాను అంత వేగంగా కారు నడిపినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న గణేశ్, మహ్మద్ ఫయాజ్, సయ్యద్ ఇబ్రహీముద్దీన్ కారును అక్కడే వదిలేసి జారుకున్నారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

More Telugu News