Narendra Modi: యూపీలో నేడు మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

  • గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్న ప్రధాని
  • గీతాప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్న మోదీ
  • బనారస్ హిందూ యూనివర్సిటీలో 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను ప్రారంభించనున్న ప్రధాని
PM to flag off 2 Vande Bharat trains in UP

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వజీద్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం ‘టిఫిన్ పే చర్చా’ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

పర్యటనలో భాగంగా తొలుత గోరఖ్‌పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని కమిటీ ఇటీవల గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహమతి-2021ప్రకటించింది. అలాగే, గోరఖ్‌పూర్-లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. జోధ్‌పూర్-సబర్మతి వందేభారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. 

ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్‌నగర్ మధ్య ఫ్రైట్ కారిడార్‌ను, వారణాసి-జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్‌చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు. బనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.  ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News