G. Kishan Reddy: నిరంకుశ పాలనకు పాతరేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

  • కుటుంబ పాలన, అవినీతి.. అంశాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్న కిషన్ 
  • కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేయాలని పిలుపు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని ఆగ్రహం
Kishan Reddy press meet with Bandi Sanjay

బీజేపీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం చేస్తోందని, ఒకటి కుటుంబ పాలన, రెండు అవినీతి అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాతరవేయాలన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కేసీఆర్ ను ఇంటికి పంపించాలని కంకణం కట్టుకున్నారన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. మొట్టమొదటి మోసం, దగా, కుట్రను దళితులకు చూపించారని, తాను తెలంగాణ కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన వ్యక్తి దళితులకు సీఎం పదవి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లకే అతీగతీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ 15 లక్షలకు పైగా ఇళ్లు కడితే, ఇక్కడ ఎన్ని కట్టారో భగవంతుడికే తెలియాలన్నారు.

ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదన్నారు. నిరంకుశ పాలనకు పాతరేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు ఎందుకు ఉండదని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉండటానికి వీల్లేదన్నారు. ఈ నెల 8న జరిగే మోదీ బహిరంగ సభలో అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

More Telugu News