Rinku Singh: ఐపీఎల్ లో సంచలనం సృష్టించినా.. టీమిండియాలో చోటు దక్కలేదు!

  • ఐపీఎల్ 16వ సీజన్ లో మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రింకూ
  • వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు
  • రింకూ సింగ్ కు మొండి చేయి
  • సెలెక్టర్లను ఏకిపారేస్తున్న నెటిజన్లు
Rinku Singh gets no place in Team India despite heroics in IPL

రింకూ సింగ్... ఈ వేసవిలో జరిగిన ఐపీఎల్ లో సిక్సర్ల వర్షం కురిపించి సంచలన ఇన్నింగ్స్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆటగాడు. ఓ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించిన ఆటగాడు... రింకూసింగ్. 

ఐపీఎల్ 16వ సీజన్ లో ఈ యువ ఆటగాడి విధ్వంసక బ్యాటింగ్ చూసిన క్రికెట్ పండితులు తప్పకుండా టీమిండియాలో చోటు సంపాదిస్తాడని అంచనా వేశారు. కానీ, వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో రింకూ సింగ్ కు స్థానం లభించలేదు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి కొత్తవారిని ఎంపిక చేసిన సెలెక్టర్లు... రింకూ సింగ్ కు మాత్రం మొండిచేయి చూపారు. 

టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ వచ్చీ రావడంతోనే వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా టీ20 జట్టు ఎంపికలో పాలుపంచుకున్నాడు. ఉన్నంతలో మెరుగైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసిన అగార్కర్... రింకూ సింగ్ విషయంలో మంచి నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. 

ఏ ప్రాతిపదికన రింకూ సింగ్ ను విస్మరించారో చెప్పాలంటూ సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అతడేమీ గాయపడలేదు కదా... ఎందుకు తీసుకోలేదు? అంటూ నిలదీస్తున్నారు. మరోవైపు, తిలక్ వర్మను ఎంపిక చేయడాన్ని వేలెత్తి చూపుతూ ముంబయి ఇండియన్స్ లాబీయింగ్ బాగా పనిచేసినట్టుందని మరికొన్ని విమర్శలు వచ్చాయి. 

రింకూ సింగ్ నే కాదు, కోల్ కతా నైట్ రైడర్స్ సారథి నితీశ్ రాణా, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ లను ఎంపిక చేయకపోవడంపైనా సెలెక్టర్లపై విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News