Prachanda: నోరు జారి చిక్కుల్లో పడిన నేపాల్ ప్రధాని

  • ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ
  • తాను ప్రధాని కావడం వెనుక ఓ భారత సంతతి వ్యాపారవేత్త కృషి ఉందని వెల్లడి
  • తనకోసం ఆయన పలుమార్లు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారని వివరణ
  • ప్రధాని ప్రచండ రాజీనామా చేయాలంటున్న విపక్షాలు
Nepal PM Prachanda invites trouble

నేపాల్ ప్రధాని ప్రచండ (పుష్పకమల్ దహల్) నోరు జారి చిక్కుల్లో పడ్డారు. తాను ప్రధాని పీఠం ఎక్కడానికి తెరవెనుక ఏం జరిగిందో చెప్పి సమస్యలను ఆహ్వానించారు. 

రోడ్స్ టు ద వ్యాలీ: ద లెగాసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని ప్రచండ ముఖ్య అతిథిగా హాజరాయ్యరు. నేపాల్ లో స్థిరపడిన భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ పై ఈ పుస్తకం తీసుకువచ్చారు. 

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని ప్రచండ మాట్లాడుతూ, తాను ప్రధానమంత్రి కావడానికి కారణం సర్దార్ ప్రీతమ్ సింగ్ అని వెల్లడించారు. తనను ప్రధాని పీఠం ఎక్కించడానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపారని, ఖాట్మండూలోని రాజకీయ వర్గాలతోనూ చర్చలు జరిపారని తెలిపారు. తాను ప్రధానిగా రావడం వెనుక సర్దార్ ప్రీతమ్ సింగ్ కృషి చాలా ఉందని కొనియాడారు. నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తన వంతు సహకారం అందించారని వివరించారు. 

అయితే, ప్రధాని ప్రచండ వ్యాఖ్యలతో విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ ప్రధానిని న్యూఢిల్లీ నియమించినట్టు స్పష్టమవుతోందని, ప్రధానిగా కొనసాగేందుకు ప్రచండ అనర్హుడని మండిపడ్డారు. 

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటులో దీనిపై నిరసనలు వ్యక్తం చేసింది. సభాసమావేశాలకు అడ్డుతగిలిన సీపీఎన్-యూఎంఎల్ పార్టీ ప్రధాని పదవి నుంచి ప్రచండ తప్పుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. 

మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశ సమగ్రత, పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థలకు భంగకరం అని పేర్కొన్నారు. 

అయితే, తన వ్యాఖ్యల పట్ల ప్రధాని ప్రచండ వివరణ ఇచ్చారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుందని చెప్పడం తన అభిమతం కాదని, సర్దార్ ప్రీతమ్ సింగ్ రాజకీయాల పట్ల కూడా ఆసక్తి చూపేవారని చెప్పడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. 

60వ దశకంలో నేపాల్ లో అడుగుపెట్టిన సర్దార్ ప్రీతమ్ సింగ్ అక్కడ ట్రాన్స్ పోర్ట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. రవాణా రంగంలో స్థానిక సంస్థలను వెనక్కినెట్టి తాను స్థాపించిన సంస్థను నెంబర్ వన్ గా నిలిపారు.

More Telugu News