USA: పౌరసత్వం మరింత కఠినతరం.. నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా మార్పులు

America to make key changes to naturalization test
  • అమెరికా పౌరసత్వం పొందేందుకు తొలిమెట్టయిన నేచురలైజేషన్ పరీక్షలో మార్పులు
  • మౌఖిక ప్రశ్నల స్థానంలో ఫొటోలు చూస్తూ ఆంగ్లంలో వివరణలు రాసే పద్ధతి
  • మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పలు అంశాలపై అభ్యర్థుల అవగాహనకు పరీక్ష
అమెరికా పౌరసత్వం పొందడం ఇకపై మరింత కఠినతరం కానుంది. విదేశీయులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్వహించే నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా కీలక మార్పులు చేయనుంది. 2008లో చివరి సారిగా ఈ పరీక్షకు మార్పులు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ప్రతి 15 ఏళ్లకు ఓమారు ఈ పరీక్షకు కాలానికి అనుగుణంగా మార్పులు చేయాలి. దీంతో, మరోమారు పరీక్ష తీరులో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. అభ్యర్థుల ఆంగ్లభాష నైపుణ్యాలను మదింపు వేసే ఈ పరీక్ష మరింత కఠినంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అమెరికా పౌరసత్వ ప్రక్రియలో నేచురలైజేషన్ పరీక్ష తొలి అంకం. నెలరోజుల పాటు సాగే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అమెరికాలో జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలపై అభ్యర్థులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కొత్త విధానంలో పరీక్షలో ఇచ్చే ఫొటోలకు ఆంగ్లంలో వివరణ రాయాల్సి ఉంటుంది. ఆంగ్ల భాషపై పట్టులేని వారికి ఇది ఇబ్బంది కలిగించనుందని అంచనా. గతంలో అభ్యర్థులు మౌఖికంగా సమాధానాలు ఇచ్చేవారు. కానీ తాజా మార్పులతో ఫొటోలు చూసి వివరణలు ఇవ్వడం కొన్ని ఆఫ్రికా దేశాల వారికి ఇబ్బందికరంగా మారనుంది. 

కొత్త విధానంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు కూడా ఉండటంతో అమెరికా చరిత్ర, ఇతర సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉంటేనే పరీక్షలో గట్టెక్కడం సాధ్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొత్త మార్పులతో వర్ధమాన దేశాలు, సంక్షుభిత ప్రాంతాల నుంచి అమెరికా ఆశ్రయం కోరి వస్తున్న వారిపై ప్రతికూల ప్రభావం తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి. కొత్త పరీక్ష విధానంపై ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం దేశ ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం, పరీక్ష విధానాన్ని ప్రకటిస్తుంది.
USA
Citizenship
Naturalization

More Telugu News