JC Prabhakar Reddy: సీఐ ఆత్మహత్య విషయం తెలియగానే.. తెల్లవారుజామున 4 గంటలకే పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారు?: జేసీ ప్రభాకర్ రెడ్డి

Why MLA Pedda Reddy went to CIs house in early hours asks JC Prabhakar Reddy
  • పెద్దారెడ్డి ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారన్న జేసీ
  • సీఐ ఫోన్ డేటాను పెద్దారెడ్డి డిలీట్ చేశారని ఆరోపణ
  • సీఐ సూసైడ్ లెటర్ ఏమైందని ప్రశ్న
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఐ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే... తెల్లవారుజామున నాలుగు గంటలకే సీఐ ఇంటికి పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తనపై కేసులు పెట్టాలని సీఐపై పెద్దారెడ్డి ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. తెల్లవారుజామునే సీఐ ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి ఆయన్ ఫోన్ డేటాను డిలీట్ చేశారని అన్నారు. సీఐ రాసిన సూసైడ్ లెటర్ ఏమైందని ప్రశ్నించారు. 

ఓ కేసులో వైసీపీ నేత ఫయాజ్ బాషా పేరును తొలగించాలని పెద్దారెడ్డి సీఐపై ఒత్తిడి తెచ్చారని జేపీ తెలిపారు. ఆనందరావు కుటుంబసభ్యులను కూడా పెద్దారెడ్డి బెదిరించారని జేసీ చెప్పారు. మౌనంగా ఉండాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సాయం రాదని హెచ్చరించారని తెలిపారు. సీఐది ముమ్మాటికీ హత్యేనని అన్నారు. పెద్దారెడ్డే ఉరి వేసి చంపేశాడేమోననే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. 

టీడీపీ అధికారంలోకి రాగానే ఆనందరావు కేసును రీఓపెన్ చేస్తామని... ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని తెలిపారు. మా అన్న దివాకర్ రెడ్డి ఏదో అన్నారని గతంలో పోలీస్ అసోసియేషన్ పెద్ద ఇష్యూ చేసిందని... ఇప్పుడు సాక్షాత్తు సీఐ చనిపోతే మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
JC Prabhakar Reddy
Telugudesam
Pedda Reddy
YSRCP
CI Suicide

More Telugu News