వివాహమై రెండు నెలలు కూడా కాకముందే.. డబ్బు, బంగారు నగలతో ఉడాయించిన యువతి

  • కరీంనగర్‌లో ఘటన
  • వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన యువతితో యువకుడి రెండో వివాహం
  • సోదరి ఇంటికి వెళ్లొస్తానని రూ. 70 వేలు, నగలతో వెళ్లిన వైనం
  • తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్తపై దాడి
  • రూ. 10 లక్షలు కావాలని డిమాండ్
పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఓ యువతి డబ్బు, బంగారం నగలతో ఉడాయించింది. కరీంనగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపూర్ణకాలనీకి చెందిన సుద్దాల రేవంత్‌ భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన యువతి ముందుకు రావడంతో గతేడాది డిసెంబరులో వీరి వివాహం జరిగింది.

పెళ్లయిన రెండు నెలల తర్వాత యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు మద్యం తాగే అలవాటు ఉందని చెప్పడంతో భర్త విస్తుపోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఓ రోజు భర్తతో గొడవ పెట్టుకున్న ఆమె సోదరి ఇంటికి వెళ్లి వస్తానని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 70 వేల నగదు, నాలుగు తులాల బంగారం పట్టుకుని వెళ్లిపోయింది. 

ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, స్నేహితుల ద్వారా సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నట్టు గుర్తించిన రేవంత్ మార్చి నెలలో ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తనను కొందరు బంధించి దాడిచేశారని, అక్కడి పోలీస్ స్టేషన్‌లో తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని వాపోయాడు. రూ. 10 లక్షలు కావాలని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయినట్టు తెలిసిందన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Karimnagar District
Second Marriage
Telangana

More Telugu News