Bandi Sanjay: బండి సంజయ్ భవితవ్యం తేలేది నేడే.. మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆరెస్సెస్

  • నాయకత్వ మార్పు పార్టీకి చేటు చేస్తుందంటున్న ఆరెస్సెస్
  • రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి ఆయనే కారణమని అధిష్ఠానంతో చెబుతున్న నేతలు
  • కిషన్‌రెడ్డికే అధ్యక్ష బాధ్యతలు?
  • కేంద్రమంత్రి వర్గంలోకి బండి సంజయ్ అంటూ వార్తలు
RSS Backs Bandi Sanjay Resists Leadership Change

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ భవితవ్యం నేడు తేలిపోనుంది. అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తప్పించేది, లేనిది ఈ రోజు లేదంటే రేపు తేలిపోతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బండి కూడా భవిష్యత్తు అర్థమై ముభావంగా ఉన్నారు. ఈ నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ సభకు తాను అధ్యక్షుడిగా వస్తానో, రానోనని చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే, ఆరెస్సెస్ నేతలు మాత్రం నాయకత్వ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో సంజయ్ సఫలమయ్యారని, రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి కారణం ఆయనేనని అధిష్ఠానం వద్ద వారు వాదిస్తున్నట్టు సమాచారం. సంజయ్‌ను మారిస్తే పార్టీకి అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని, బీజేపీ గ్రాఫ్ పడిపోవడం ఖాయమని హెచ్చరించినట్టు సమాచారం.

మరోవైపు, బండిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై సంజయ్‌కు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, సోషల్ మీడియా నుంచి బండికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుండడం, రాష్ట్రంలోని ఆరెస్సెస్ నేతలు కూడా ఆయనకు అనుకూలంగా ఉండడంతో అధిష్ఠానం పునరాలోచనలో పడినట్టు కూడా చెబుతున్నారు.

More Telugu News