President Of India: రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

  • అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ముర్ము
  • హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం బయల్దేరిన రాష్ట్రపతి 
  • పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న గవర్నర్, సీఎం 
Telangana Governer tamilsai and CM Kcr welcomed president murmu at Hakimpet Airport

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పూలగుచ్ఛంతో ఆహ్వానించి, శాలువా కప్పి ప్రెసిడెంట్ ను సన్మానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రెసిడెంట్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్రపతి రాకకు ముందే విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుతూ పలకరించుకున్నారు. పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించుకున్నారు. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అయ్యాక ఇద్దరూ కలిసి రన్ వే పై మాట్లాడుకుంటూ వెళ్లడం కనిపించింది. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విభేదాలన్నీ పక్కన పెట్టి కేసీఆర్, తమిళిసై ఇద్దరూ రాష్ట్రపతికి స్వాగతం చెప్పడం, ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది.

More Telugu News