Devendra Fadnavis: శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ ఎందుకు చీలిపోయిందో చెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్

  • కూతురు సుప్రియకు కీలక పదవిని పవార్ కట్టబెట్టడం వల్లే ఎన్సీపీ చీలిందన్న ఫడ్నవిస్
  • పార్టీని వారసులకు కట్టబెట్టాలనే ఆలోచన సరికాదని వ్యాఖ్య
  • విపక్షాలను ఏకం చేయగల శక్తి పవార్ కు ఉందని ప్రశంస
Devendra Fadnavis comments on NCP split

దేశ రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేతకు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చిన అజిత్ తన వర్గంతో కలసి షిండే ప్రభుత్వంలో చేరిపోయారు. తమదే అసలైన ఎన్సీపీ అని అజిత్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

తన కూతురు సుప్రియా సూలేకు పార్టీలో శరద్ పవార్ ఉన్నత స్థానాన్ని కట్టబెట్టారని... పార్టీలో చీలికకు ఇదే కారణమని ఫడ్నవిస్ అన్నారు. తన రాజకీయ వారసురాలిగా కూతురు సుప్రియను చేయాలని శరద్ పవార్ భావిస్తున్నారని చెప్పారు. రాజకీయ నేతల కొడుకు, కూతురు రాజకీయాల్లోకి రావడం సహజమేనని, దీన్ని తాము వ్యతిరేకించమని... అయితే, పార్టీని తమ వారసులకు కట్టబెట్టాలనే ఆలోచన మాత్రం సరికాదని అన్నారు. 

వారసత్వ రాజకీయాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆ కుటుంబం కోసమే పని చేస్తాయని, ప్రజల కోసం పని చేయవని చెప్పారు. ఎన్సీపీ అధ్యక్షుడిగా ఇప్పటికీ శరద్ పవారే ఉన్నారని... కూతురుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, ఆమెను ఫ్రంట్ లైన్ లో పెట్టారని చెప్పారు. దీని అర్థం సుప్రియను తదుపరి పార్టీ అధ్యక్షురాలిని చేయడమేనని అన్నారు. ప్రస్తుతం డ్రైవింగ్ సీట్ లో శరద్ పవార్ ఉన్నారని, బ్యాక్ సీట్లో సుప్రియ ఉన్నారని... రాబోయే రోజుల్లో డ్రైవింగ్ సీట్లోకి సుప్రియ వస్తారని, బ్యాక్ సీట్లోకి పవార్ షిఫ్ట్ అవుతారని చెప్పారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని తెలిపారు.

ఇదే సమయంలో శరద్ పవార్ పై ఫడ్నవిస్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో పవార్ ఒకరని అన్నారు. విపక్షాలను కలపగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉందని చెప్పారు. రాజకీయాలపై నలు వైపుల నుంచి పట్టు ఉన్న కొద్ది మంది నేతల్లో పవార్ ఒకరని అన్నారు. శరద్ పవార్ కు కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ, ఆయన చాలా ఫిట్ గా ఉన్నారని చెప్పారు. విపక్ష నేతలను కలవడానికి దేశ వ్యాప్తంగా తిరిగే శక్తి ఆయనకు ఉందని అన్నారు.

More Telugu News