Harish Rao: హాఫ్ నాలెడ్జ్ అంటూ హరీశ్ విమర్శలు... ప్రభుత్వాలను పొగడటం తన బాధ్యత కాదన్న గవర్నర్

Harish Rao versus tamilisai
  • రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని హరీశ్ ఆరోపణ
  • కొందరు కళ్లుండి చూడలేరు.. చెవులుండి వినలేరని మంత్రి విమర్శ
  • విమర్శలు పట్టించుకోనని గవర్నర్ కౌంటర్
  • ఉస్మానియాలో వసతులు సరిగ్గా లేవని వెల్లడి
కొందరు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని, రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా నడుచుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్ లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇదే సమయంలో గవర్నర్ తమిళిసైపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

నిమ్స్ కు ఆలిండియా ర్యాంకులు వస్తున్నాయని, అభివృద్ధి జరగకుంటే ఎలా వస్తున్నాయని నిలదీశారు. తెలంగాణ వచ్చాక నిమ్స్ లో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన గొప్ప డాక్టర్లు నిమ్స్ లో ఉన్నట్లు చెప్పారు. ఏడు రోజుల్లో కొత్త నిమ్స్ భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొందరు కళ్లుండి చూడలేరని, చెవులుండి వినలేరని విమర్శలు గుప్పించారు.

మరోవైపు, హరీశ్ రావు వ్యాఖ్యలకు గవర్నర్ తమిళసై పరోక్షంగా స్పందించారు. తాను విమర్శలను పట్టించుకోనని, కానీ ఉస్మానియాలో వసతులు సరిగ్గా లేవన్నారు. న్యూరోవార్డులో పైకప్పు కూడా సరిగ్గా లేదన్నారు. రోగుల బాధను చూసి తాను ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఏదేమైనా పేషెంట్ల సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ప్రభుత్వాలను పొగడటం తన బాధ్యత కాదని స్పష్టం చేశారు. చాలా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారని, కానీ పేద పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందాలన్నారు.
Harish Rao
Tamilisai Soundararajan

More Telugu News