Nara Lokesh: మహిళలను గౌరవించాలన్నది మనసు నుంచి రావాలి: నారా లోకేశ్

  • నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో మహిళాశక్తితో లోకేశ్ కార్యక్రమం
  • మహిళలతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన కడప 10 రూపాయల డాక్టర్ నూరీ 
  • మహిళల సమస్యలు, టీడీపీ కార్యాచరణ పట్ల వివరాలు తెలిపిన లోకేశ్ 
Lokesh held face to face with woman in Nellore

నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో 'మహాశక్తితో లోకేశ్'  పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖాముఖి సమావేశమై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన '10 రూపాయల డాక్టర్' నూరి ఫర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారిగా రాజకీయాలు ఎంతో దిగజారిపోయాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే,మహిళలను అవమానించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 

"నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మహిళలకేం న్యాయం చేస్తాడు? 145 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్నాకే మహాశక్తి కార్యక్రమాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని అమలుచేసి తీరుతాం" అని స్పష్టం చేశారు.

“మహాశక్తితో లోకేశ్” కార్యక్రమంలో మహిళల ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు:

నూరి ఫర్వీన్: మీకు ఆడపడుచులు లేరు కదా... మహిళల సమస్యల పట్ల మీకెంత అవగాహన ఉంది? మీరు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మహిళలకు ఏ విధంగా అండగా నిలుస్తారు?

లోకేశ్: నేను చిన్నప్పటి నుండి చెల్లి కావాలని అమ్మని అడిగేవాడిని. బ్రాహ్మణి గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. నా తల్లి భువనేశ్వరి నన్ను చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచింది. ఇప్పటికీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే అమ్మ ఊరుకోదు. 

సమాజంలో తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని నేను కోరుకుంటాను. అంగన్వాడీకి పిల్లలను పంపుతున్న నాటి నుండి తల్లులు బిడ్డలకు క్రమశిక్షణ, మహిళలను గౌరవించాలనే బుద్ధిని నేర్పాలి. మహిళలను గౌరవించాలన్నది మనసు నుంచి రావాలి.

ప్రశ్న: పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో ఫ్యామిలీని మిస్ అయినట్లు అన్పించడం లేదా?

లోకేశ్: నేను నా కొడుకు దేవాన్ష్ ను బాగా మిస్ అవుతున్నా. వాడితో నేను బాగా ఆడుకుంటాను. కానీ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు తమ సమస్యలు చెప్పుకునే వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నేను యువగళం పాదయాత్రను చేపట్టాను. 

యువతలో చైతన్యం తీసుకురావాల్సి ఉంది. రాష్ట్రంలో యువత బాగా వెనుకబడిపోయారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నా.

సుబ్బాయమ్మ: అసెంబ్లీలో రోజా మహిళల గురించి ఏదేదో మాట్లాడుతుంది. కానీ రాష్ట్రంలో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరూ మాట్లాడడం లేదు. ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు మాకు లేవు. మీరు అధికారంలోకి వస్తే మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు?

లోకేశ్: కేంద్రం నివేదికల ప్రకారం ఏపీలో ప్రతి గంటకు మహిళలపై రెండు దాడులు, మానభంగాలు వంటివి జరుగుతున్నాయి. ఏపీలో చట్టాలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. 

మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను వేసుకోమని చెప్పింది. ఆమె దృష్టిలో చీర, గాజులు వేసుకునే వారు చేతకాని వాళ్లు. తెలుగు మహిళ నాయకులు రోజాకు చీర,సారె ఇవ్వడానికి వెళితే పోలీసులు చితకబాదారు. మహిళల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఇది. మహిళలకు అన్నింటిలో సమాన హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని గుర్తుచేయడమే నా లక్ష్యం.

ప్రశ్న: అంగన్వాడీ కార్యకర్తలం 48 ఏళ్లుగా గర్భవతులు, బాలింతలకు మేం సేవలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు. పనిభారం పెరిగింది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేస్తారా?

లోకేశ్: టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాలు పెంచుతాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం. అంగన్వాడీలందర్నీ ఆదుకుంటాం. వైసీపీ ప్రభుత్వంలో మహిళలు మాట్లాడినా, పోస్టులు పెట్టినా, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినా వారిపై వైసీపీ వీధి కుక్కలు అసభ్యంగా పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు. ఇలాంటి వారిని మేం అధికారంలోకి వచ్చాక వదిలే పరిస్థితి లేదు.

నూరి ఫర్వీన్: మహిళల రక్షణ కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన మీ అమ్మను అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు ఎలా స్పందించారు?

లోకేశ్: నా తల్లిని వైసీపీ నాయకులు శాసనసభ సాక్షిగా అవమానించారు. నా తల్లి ఏనాడూ బయటకు రాలేదు, ఏ తప్పూ చేయలేదు. వైసీపీ వాళ్లు మాట్లాడిన మాటలకు నా తల్లి దాదాపు నెలరోజులు మానసిక క్షోభ నుండి బయటపడలేకపోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు రక్షణ ఉందా లేదా అని ప్రతి మహిళ ఆలోచించాలి. 

జగన్ పాలనలో రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి నా తల్లికి జరిగిన అవమానమే. నా తల్లికి జరిగిన అవమానం మరో తల్లికి జరగకూడదనేది మా అభిమతం. అసెంబ్లీలోనే మహిళలకు గౌరవం దక్కకపోతే సభ్య సమాజంలో ఎలా గౌరవం లభిస్తుంది. 

నా తల్లిని అవమానించిన వారిని ముఖ్యమంత్రి జగన్ కనీసం మందలించకపోగా వెకిలినవ్వులు నవ్వి తమ నాయకులను ప్రోత్సహించారు. మేం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని మహిళలను అవమానించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

లావణ్య: మహాశక్తి ద్వారా మ్యానిఫెస్టోలో మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు, గ్యాస్ సిలెండర్లు, ఉచిత బస్సు, ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఎప్పటినుంచి అమలు చేద్దామనుకుంటున్నారు? మద్య నిషేధం ఎంతవరకు సాధ్యం?

లోకేశ్: టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మహాశక్తిని అమలుచేస్తాం. సంక్షేమంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పేదవాళ్లకు అండగా నిలబడేది ప్రభుత్వం. సంక్షేమంపైనే నడవడం సాధ్యం కాదు, అభివృద్ధి కూడా ముఖ్యం, ఎకనమిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. 

ఈ ప్రభుత్వం అభివృద్ధి ఆపేసింది, అప్పులు చేసి సంక్షేమం అమలు చేసినప్పుడు, అప్పులు తీర్చాల్సింది మనమే. ఏపీలో మద్యనిషేధం జరగదు, మద్యంపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పుతెచ్చారు, రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. అందుకే మద్యం ధరలు విపరీతంగా పెంచారు. 

ఊరూరా వైన్ షాపు ఉంది... మద్యం షాపుల ఉద్యోగులను టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రిస్తాం, సమాజంలో చైతన్యం తెస్తాం.

సుజాత, గైనకాలజిస్ట్: మేం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సర్టిఫికెట్లు తీసుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం నేడు యూనివర్సిటీ పేరు మార్చేసింది. రేపు మేం ఎక్కడికైనా వెళ్లాలంటే మా సర్టిఫికెట్ లోని యూనివర్సిటీ పేరు లేకపోవడం సమస్యత్మాకంగా మారే అవకాశముంది. మీరు వచ్చాక యూనివర్సిటీల పేర్లు మార్చకుండా చర్యలు తీసుకుంటారా?

లోకేశ్: ఏపీ ముఖ్యమంత్రి లక్షకోట్లు ప్రజా ధనాన్ని లూఠీ చేశాడు, అతనిపై 12 సీబీఐ చార్జి షీట్లు ఉన్నాయి. ఇతను 16 నెలలు జైలులో ఉండి వచ్చాడు. ఏపీ ప్రజలు ఇలాంటి దొంగకు తాళాలు ఇచ్చినట్లుగా ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టారు. 

1983కు ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీ తప్ప ఏపీలో హెల్త్ యూనివర్సిటీ లేదు. ఎన్టీఆర్ కేంద్రంతో మాట్లాడి ఏపీలో సిద్ధార్థ కాలేజీని హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు. 

కానీ, జగన్ ఆత్మలతో మాట్లాడి బిల్లు పెట్టి పేరు మార్చేశారు, చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వైఎస్సార్ కడప పేరును మేమేమీ మార్చలేదే! టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చుతాం.

విజయలక్ష్మి: జగన్ సొంత చెల్లెళ్లకే న్యాయం చేయడం లేదు. మాకేం న్యాయం చేస్తాడు? మీరు అధికారంలోకి వచ్చాక మాకు అండగా నిలబడతారా?

లోకేశ్: 2019లో సాక్షి పత్రిక మొదటి పేజీలో నారాసుర రక్తచరిత్ర అంటూ ఫుల్ పేజీ వార్త రాశారు. కానీ చివరకు నిందితులంతా జగన్ కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు. వీళ్లంతా సీబీఐ కేసుల్లో ఇరుక్కుని, బయటపడేందుకు అనేక డ్రామాలు ఆడుతున్నారు. 

జగన్ తల్లిని, చెల్లిని ఉపయోగించుకుని సీఎం అయ్యాక వాళ్లను ఇంటి నుండి తరిమేశాడు. జగన్ సొంత చిన్నాన్న వివేకా కూతరు సునీతకు కూడా రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడో లేదో మహిళలంతా ఆలోచించాలి. 

మహిళలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు. దీన్ని ఆయన అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించారు. ఏపీ చరిత్రలో తొలి మహిళా స్పీకర్ ను తెచ్చింది టీడీపీ.

నూరి ఫర్వీన్: వైద్య విద్య చదివిన వారికి సరైన ఉద్యోగం దొరికే పరిస్థితులు లేవు. పీజీ చదివే స్థోమత లేక ఆగిపోతున్నాం. మీరు ఎలా ప్రోత్సహిస్తారు?

లోకేశ్ : ఈ ప్రభుత్వం వచ్చాక రిక్రూట్ మెంట్ లేదు, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సి ఉంది.   జాబ్ నోటిఫికేషన్స్ టైం ప్రకారం ఇవ్వాలి, పద్ధతి ప్రకారం 5 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

సుధాలక్ష్మి: విద్యార్థులపై బలవంతంగా రుద్దబడిన ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేసి, విద్యార్థులకు మీడియంను ఎంచుకునే స్వేచ్ఛనిస్తారా?

లోకేశ్: మీడియం ను ఎంచుకోవాల్సిన స్వేచ్చ, హక్కు విద్యార్థులకు ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఇంగ్లీషు మీడియంను విద్యార్థులపై రుద్దుతోంది. మేం అధికారంలోకి వచ్చాక ఇంగ్లీషు మీడియం తప్పనిసరి నిబంధనను రద్దు చేస్తాం. విద్యార్థులకు స్వేచ్ఛనిస్తాం

ప్రశ్న: నా కొడుకు కనీసం కూరగాయలు తేవడానికి కూడా బయటకు వెళ్లడు, అలాంటిది 4 వేల కి.మీ. ఎలా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకే బాధ కలుగుతోంది.

లోకేశ్: ప్రజల ఆదరణే నన్ను నడిపిస్తోంది. మహిళలు, ప్రజల్లో చైతన్యం తెచ్చి సైకో పాలనను అంతం చేసేవరకు విశ్రమించబోను. సైకో పోతాడు, సైకిల్ వస్తుంది. 

యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం 1892.6 కి.మీ.

146వ రోజు పాదయాత్ర వివరాలు (4-7-2023)

నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)

సాయంత్రం

4.00 – అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.

4.50 – 38వ వార్డులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

5.40 – ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.00 – నెల్లూరు సిటీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం/వీఆర్సీ జంక్షన్ లో బహిరంగ సభ. యువనేత ప్రసంగం.

7:10 - శివ ప్రియ హోటల్ దగ్గర స్థానికులతో సమావేశం.

7:20 - రాయాజి స్ట్రీట్ దగ్గర స్థానికులతో మాటామంతీ.

7.30 – గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

7.40 – కనక మహాలక్ష్మి సెంటర్లో స్వర్ణకారులతో సమావేశం.

7.50 – సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

8.05 – ఆత్మకూరు బస్టాండ్ వద్ద మీ – సేవ కార్మికులతో సమావేశం

8.20 – స్టోన్ హౌస్ పేట వద్ద స్థానికులతో మాటామంతీ.

8.35 – పప్పుల వీధిలో స్థానికులతో సమావేశం.

9.05 – పెన్నా బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

9.25 – వెంకటేశ్వరపురం బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

10.10 – సాలుచింతల వద్ద కోవూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

10.35 – సాలుచింతల విడిది కేంద్రంలో బస.

****

More Telugu News