Virender Sehwag: ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ ఇంత ఘోరంగా పతనం కావడానికి కారణం ఇదే: సెహ్వాగ్

  • వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించని వెస్టిండీస్
  • ఈ విషయం తనకు ఎంతో బాధను కలిగిస్తోందన్న సెహ్వాగ్ 
  • రాజకీయాలే ఆ జట్టును నాశనం చేశాయని వ్యాఖ్య 
  • ఎప్పుడో పతనం ప్రారంభమయిందని ఇయాన్ బిషప్ ఆవేదన
Virender Sehwag reaction on West Indies not qualifying for ODI World Cup

ఒకానొకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్... ఈ సారి వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మింగుడుపడటం లేదు. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన విండీస్ లేకపోతే వరల్డ్ కప్ లో మజా ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ప్రపంచ కప్ కు విండీస్ అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇంతకు మించి పతనం కావడానికి వెస్టిండీస్ కు మరేమీ మిగల్లేదని విమర్శించారు. ప్రపంచాన్ని శాసించిన ఆ జట్టును రాజకీయాలు నాశనం చేశాయని చెప్పారు. 

వరల్డ్ కప్ కు విండీస్ అర్హత సాధించలేకపోవడం తనకు ఎంతో బాధను కలిగిస్తోందని సెహ్వాగ్ అన్నారు. వాళ్లకు టీ20 మ్యాచ్ లు ఆడటమే ప్రధానంగా మారిందని... దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావించడం లేదని 1982 ప్రపంచకప్ ను గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్ లాల్ విమర్శించారు.  

విండీస్ మాజీ దిగ్గజ పేసర్ ఇయాన్ బిషప్ మాట్లాడుతూ.. తమ జట్టు క్రికెట్ పతనం ఇప్పుడు ప్రారంభమైనదని కాదని... ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు జట్టులోకి రాకముందే పతనం మొదలయిందని అన్నారు. ప్రస్తుత జట్టు క్రికెట్ ను మొదలు పెట్టక ముందే పతనం ప్రారంభమయిందని చెప్పారు. గత పదేళ్లుగా వన్డేల్లో అగ్రశ్రేణి జట్లపై విండీస్ సరైన ప్రదర్శన చేయలేకపోయిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన జట్టు ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వనరులతోనే జింబాబ్వే జట్టు అదరగొడుతుంటే... విండీస్ మళ్లీ ఎందుకు పుంజుకోకూడదని ప్రశ్నించారు. 

వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ మాట్లాడుతూ... విభిన్న ప్రాంతాలకు చెందినవారమనే భావనను పక్కన పెట్టాలని... అందరూ కలిసి ఒక జట్టుగా ఆడేందుకు ప్రయత్నించాలని సూచించారు.

More Telugu News