Vemula Prashanth Reddy: రాహుల్ గాంధీ.. మాటలు జారొద్దు!: మంత్రి ప్రశాంత్ రెడ్డి

telangana minister vemula prashanth reddy fires on rahul gandhi
  • కాంగ్రెస్ పార్టీలోనే రాచరికం ఉందంటూ మంత్రి ఫైర్
  • ఏ హోదాలో రూ.4 వేల పెన్షన్ హామీ ఇచ్చారని నిలదీత
  • నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోయాడని మండిపాటు
  • లీడర్ కాదు ఆయన కేవలం రీడరేనంటూ ఎద్దేవా
ఓ జాతీయ నాయకుడిగా పరిణతితో మాట్లాడాలని, మాటలు జారొద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ నేతపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాకుండా నిజాలు మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. రాహుల్ గాంధీ కేవలం రీడర్ మాత్రమేనని, లీడర్ కాదని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చిన రాహుల్ కు అసలు పింఛన్ల గురించి తెలియదని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వృద్ధాప్య పింఛన్ ఎంతిస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ నేతగా మొత్తం దేశమంతా వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు ఇస్తామని ప్రకటించే దమ్ముందా? అంటూ నిలదీశారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి పట్టుచీర కొనిస్తానని చెప్పినట్లు రాహుల్ గాంధీ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ హామీలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్ రాచరికపోకడను ప్రదర్శిస్తున్నారంటూ రాహుల్ చేసిన విమర్శలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రాచరిక పోకడ రాహుల్ దేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ హాదా ఉందని ప్రజలకు హామీలు ఇస్తున్నారని రాహుల్ ను నిలదీశారు. గాంధీ కుటుంబానిదే రాచరికపోకడ అని, పార్టీ అధ్యక్షులుగా ఇతరులను నియమించి, విధివిధానాలను మాత్రం సోనియా కుటుంబం ప్రకటిస్తుందని విమర్శించారు.

కాళేశ్వరం అవినీతిపై రాహుల్ చేసిన విమర్శలు నవ్వుపుట్టించేలా ఉన్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్ర్క్రిప్ట్ చదివితే ఇలాగే ఉంటుందని విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, భారత దేశంలో అవినీతిని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
Vemula Prashanth Reddy
BRS
Rahul Gandhi
Congress
khammam sabha

More Telugu News