YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్‌లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ

  • రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ
  • గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తుతో నష్టపోయామని వ్యాఖ్య
  • కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్న కాంగ్రెస్ నేత
YS Sharmila Soon To Join In Congress Says KVP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ నష్టపోయిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, కాంగ్రెస్‌తోనే రాష్ట్రం తిరిగి అభివృద్ది చెందుతుందని ప్రజలు నమ్మే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.

More Telugu News