Karnataka High Court: ఆ విద్యార్థులకు కోటి రూపాయలు చెల్లించండి.. నర్సింగ్ కాలేజీని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు

Karnataka High Court orders college to pay Rs 10 lakh each to 10 nursing students
  • కాలేజీ తీరుతో ఏడాది విద్యా సంవత్సరాన్ని నష్టపోయిన పదిమంది విద్యార్థులు
  • ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం
  • క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌జీయూహెచ్ఎస్‌కు ఆదేశం
తప్పుడు రిజిస్టర్ కారణంగా ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన 10 మంది విద్యార్థులకు కోటి రూపాయలు చెల్లించాలంటూ కలబురగిలోని మదర్ మేరీ నర్సింగ్ కాలేజీని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇది ప్రత్యామ్నాయం కాకపోయినా సరే బాధిత విద్యార్థి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని పేర్కొంది. అలాగే, కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్‌జీయూహెచ్ఎస్)ను ఆదేశిస్తూ జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పాలనా పరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

7 ఏప్రిల్ 2022 కంటే ముందు నర్సింగ్ కాలేజీ విద్యార్థులను చేర్చుకోలేదు. అయినప్పటికీ కల్పిత రిజిస్టర్‌ను రూపొందించినట్టు కోర్టు గుర్తించింది. అయితే,  కాలేజీ మాత్రం తాము సకాలంలోనే విద్యార్థులను చేర్చుకున్నామని, కాకపోతే సాంకేతిక సమస్యల కారణంగా వారి వివరాలను అప్‌లోడ్ చేయలేకపోయామంటూ విద్యార్థుల పేర్లతో పేపర్ అతికించింది. 

కాలేజీ యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీలో అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా గడువు ముగిసిన తర్వాత కూడా అడ్మిషన్లు నిర్వహించినప్పటికీ ఆ డేటాను అప్‌లోడ్ చేయలేదని పేర్కొంది. ఆ విషయాన్ని విద్యార్థుల వద్ద దాచిపెట్టి అడ్మిషన్ రిజిస్టర్‌లో వారి పేర్లను చేర్చేందుకు వారి నుంచి ఫీజులు వసూలు చేశారని తెలిపింది. ఫలితంగా ఆర్‌జీయూహెచ్ఎస్ తిరస్కరణ కారణంగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయలేకపోయారని కోర్టు పేర్కొంది.
Karnataka High Court
Mother Mary College of Nursing
Nursing Students

More Telugu News