Telangana: అందరి చూపు ఖమ్మం కాంగ్రెస్ సభ వైపే

Rahul gandhi to attend congress public meeting at khammam today
  • నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జన గర్జన సభ
  • భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి, జూపల్లి చేరికలు
  • ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్!
తెలంగాణ రాజకీయ వర్గాల చూపు  ఇప్పుడు ఖమ్మంపైనే కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభపై అందరి దృష్టి నెలకొంది. ఈ సభకు  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని, తద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావొచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దాంతో, రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపుతో పాటు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇదే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. 

తెలంగాణలో పూర్వ వైభవం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కాంగ్రెస్ పార్టీలో భట్టి పీపుల్స్ మార్చ్ నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చింది. అదే సమయంలో బీజేపీలో కీలక నేతల మధ్య విభేధాలు వెలుగులోకి రావడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయింది. ఈ సభ వేదికగా రాహుల్ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జన గర్జన సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై అధికార బీఆర్ఎస్ ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని, బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. 

వంద ఎకరాలు.. 5 లక్షల మందితో సభ
జన గర్జన సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొనే సభ ఏర్పాట్లను చేసింది. జన సమీకరణకు అగ్రనేతలు కసరత్తులు చేశారు. రాహుల్ ఢిల్లీ మీదుగా విజయవాడ నుంచి ఖమ్మం రానున్నారు. రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొనే అవకాశం ఉంది.
Telangana
Congress
Rahul Gandhi
Khammam
BRS
BJP

More Telugu News