Arun Reddy: హైదరాబాదులో బీఎండబ్ల్యూ కార్లు చోరీ చేస్తున్న వెబ్ డిజైనర్ అరెస్ట్

  • వృత్తి వెబ్ డిజైనింగ్
  • ప్రవృత్తి ఖరీదైన కార్ల చోరీ
  • కార్ పార్కింగ్ చేస్తానంటూ నమ్మించి ఉడాయించిన అరుణ్ రెడ్డి
  • మీడియాకు వివరాలు తెలిపిన డీసీపీ శిల్పవల్లి
Hyderabad police arrests web designer who stolen BMW cars

హైదరాబాదులో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల చోరీలకు పాల్పడుతున్న ఓ చిన్న తరహా ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు రెండు బీఎండబ్ల్యూ కార్లు చోరీ చేసినట్టు గుర్తించారు. ఒక్కో కారు విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని భావిస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ కె.శిల్పవల్లి మీడియాకు తెలిపారు. బి.అరుణ్ రెడ్డి అనే యువకుడు వెబ్ డిజైనర్ గా కొనసాగుతున్నాడని, ప్రముఖ గాయకుడు బాద్షా కచేరీ సందర్భంగా అరుణ్ రెడ్డి ఓ బీఎండబ్ల్యూ జడ్ 4 కారును దొంగతనం చేశాడని తెలిపారు. 

"ఓ సంగీత కచేరికి హాజరయ్యేందుకు ఖరీదైన కారులో వచ్చిన మహిళను అరుణ్ రెడ్డి టార్గెట్ గా ఎంచుకున్నాడు. తాను కచేరీ వద్ద కార్ పార్కింగ్ బాధ్యతలు చూస్తున్నానని ఆ మహిళను నమ్మించాడు. అది నిజమే అని భావించిన ఆ మహిళ తన కారు తాళాలు అరుణ్ రెడ్డి చేతికి ఇచ్చింది. ఇదే అదనుగా కారును తీసుకుని ఆ మాయదారి వెబ్ డిజైనర్ తుర్రుమన్నాడు. 

కోటి రూపాయల కారు పోగొట్టుకున్న ఆ మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ విలాసవంతమైన కారులో షికారు చేసిన అరుణ్ రెడ్డి, ఆ కారును హోటల్ షెరాటన్ వద్ద పార్క్ చేసినట్టు గుర్తించారు. ఆ కారును తీసుకునేందుకు అతడు వచ్చిన సమయంలో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల విచారణలో తాను మరో హై ఎండ్ కారును కూడా కొట్టేసిన విషయాన్ని అరుణ్ రెడ్డి బయటపెట్టాడు. గతేడాది నగరంలోని ఓ పబ్ వద్ద బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును చోరీ చేశానని వెల్లడించాడు. ఈ కారును ఝార్ఖండ్ నెంబర్ ప్లేట్ తో వాడుతున్నాడు. కుటుంబ సభ్యులు అడిగితే, తాను ఝార్ఖండ్ లో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశానని చెప్పాడు" అని డీసీపీ శిల్పవల్లి వివరించారు.

More Telugu News