Shaheen Afridi: నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ రికార్డును నెలకొల్పిన పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిదీ

Pakistan bowler Shaheen Afridi creates world record
  • టీ20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నాటింగ్ హామ్, వార్విక్ షైర్ ల మధ్య మ్యాచ్
  • ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన షహీన్ అఫ్రిదీ
  • గోల్డెన్ డక్ అయిన ముగ్గురు బ్యాట్స్ మెన్లు
పాకిస్థాన్ అంటేనే ఫాస్ట్ బౌలర్లకు ప్రసిద్ధి. తొలి నుంచి కూడా పాక్ నుంచి ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్లు వచ్చారు. వేగంతో, స్వింగ్ తో, రివర్స్ స్వింగ్ తో, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు ముచ్చెమటలు పట్టించడంలో పాక్స్ ఫాస్ట్ బౌలర్లది ఒక ప్రత్యేకమైన స్థానం. తాజాగా పాక్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదీ తన పదునైన నిప్పులు చెరిగే బంతులతో సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే 4 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 

ఇంగ్లండ్ లో టీ20 బ్లాస్ట్ 2023 టోర్నీలో భాగంగా నాటింగ్ హామ్, వార్విక్ షైర్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో షహీన్ ఈ ఫీట్ ను సాధించాడు. నాటింగ్ హామ్ తరపున ఆడుతున్న షహీన్... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 4 వికెట్లను పడగొట్టారు. తొలి బంతికి అలెక్స్ డేవిస్ (0), రెండో బంతికి క్రిస్ బెంజమిన్ (0)లను ఔట్ చేశాడు. మూడో బంతికి వికెట్ పడకపోవడంతో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ఐదో బంతికి డాన్ మౌస్లీ (1), చివరి బాల్ కు ఎడ్ బర్నార్డ్ (0)లను పెవిలియన్ కు చేర్చాడు. ఈ నలుగురు బ్యాట్స్ మెన్ లో ముగ్గురు గోల్డెన్ డక్ అయ్యారు.

ఈ మ్యాచ్ లో వార్విక్ షైర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్ హామ్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆ తర్వాత వార్విక్ షైర్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన షహీన్ 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. వీటిలో 12 రన్స్ వైడ్ల రూపంలో సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతినే షహీన్ వైడ్ గా వేశాడు. అదే బంతికి 4 పరుగులు బైస్ రూపంలో రావడంతో, వైడ్ల రూపంలో 5 పరుగులు వచ్చినట్టయింది.
Shaheen Afridi
Pakistan
T20 Blast
World Record

More Telugu News