Bengaluru: బెంగళూరులో బతకాలంటే రూ.30,000 నుండి రూ.1,00,000 కావాలట!

  • బెంగళూరులో ఫ్రెషర్ జీవించడానికి, పని చేయడానికి అవసరమైన కనీస జీతం ఎంత అని ప్రశ్నించిన నెటిజన్
  • ఆసక్తికరమైన సమాధానాలు చెప్పిన పలువురు నెటిజన్లు
  • ప్రీమియం నీడ్స్ కోసం రూ.80వేల నుండి రూ.1 లక్ష కావాలన్న నెటిజన్
Man asks about minimum salary fresher needs to survive in Bengaluru

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ అంశంపైనైనా చర్చకు ట్విట్టర్ అందరికీ అందుబాటులో ఉన్న వేదిక. ప్రతి చిన్న సమస్య నుండి మొదలుపెడితే అభిప్రాయాలను వ్యక్తపరచడం వరకు అన్నింటికీ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ను ఉపయోగించేవారు ఎంతోమంది ఉన్నారు. ట్విట్టర్ వేదికగా కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి పోస్ట్ ఒకటి అందరిలోకి ఆసక్తిని కలిగిస్తోంది. ఇషాన్ శర్మ అనే క్రియేటర్, కోడర్... బెంగళూరులో జీవించేందుకు అవసరమైన కనీస వేతనం గురించి ట్విట్టర్ ద్వారా యూజర్లను అడిగాడు. "బెంగళూరులో ఒక ఫ్రెషర్ జీవించడానికి, పని చేయడానికి అవసరమైన కనీస జీతం ఎంత?" అని ఇషాన్ తన పోస్ట్‌లో ప్రశ్న అడిగాడు.

ఇషాన్ ప్రశ్నకు నెటిజన్లు స్పందించారు. చాలామంది నుండి ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. ఓ నెటిజన్ 2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా చూస్తే పీజీలో ఉండే ప్రెషర్ కు రూ.30,000, ప్లాట్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ బ్యాచిలర్‌కు రూ.50,000, పెళ్లైన వారికి రూ.75,000, 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ.1,00,000 ప్రతి నెల ఉండాల్సిందేనని సమాధానం ఇచ్చాడు. ఈ ట్విట్టరిటీ సమాధానం అందర్నీ ఆకర్షించింది.

ఇతర నెటిజన్లు కూడా సమాధానాలు ఇచ్చారు. కొంతమంది కనీసం రూ.30,000 ఉండాలని, మినిమం స్టాండర్డ్ లివింగ్ అయితే రూ.40 వేల నుండి రూ.50 వేలు, ప్రీమియం నీడ్స్ కోసం అయితే రూ.80వేల నుండి రూ.1 లక్ష కావాలని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్ కు కనీసం రూ.50,000 కూడా సరిపోవని మరొకరు పేర్కొన్నారు.

More Telugu News