Yogi Adityanath: గ్యాంగ్‌‍స్టర్ కబ్జా స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్

  • హత్యగు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ కబ్జా భూమిని గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
  • పీఎంఏవై కింద 76 ఇళ్లు నిర్మించి, పేదలకు తాళం చెవులు ఇచ్చిన సీఎం
  • ఇక, ఇక్కడి నుండి వెళ్లిపోమని తనకు ఎవరూ చెప్పరని ఓ లబ్ధిదారుడి ఆనందం
UP Govt Hands Over Flats Constructed On Gangster Atiq Ahmeds Illegal Land To Poor

ప్రయాగ్‌రాజ్ లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్న ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం... అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించి పేదలకు పంచిపెట్టింది. పీఎంఏవై కింద 76 ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఆ ఇళ్లకు సంబంధించిన తాళం చెవులను సీఎం యోగి లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారులకు ఇళ్లను పంచి పెట్టిన ప్రాంతంలో అక్కడున్న చిన్నారులతో సీఎం యోగి ముచ్చటించారు. నిరుపేదలకు ఇచ్చిన ప్లాట్లను కూడా ఆయన పరిశీలించారు.

41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన ఫ్లాట్ ను కేవలం రూ.3.5 లక్షలకే అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుడు మాట్లాడుతూ.. తనకు చాలా ఆనందంగా ఉందని, తనకు సొంత ఇల్లు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇప్పుడు ఇక తనను ఇక్కడి నుండి వెళ్లిపోమని ఎవరూ చెప్పలేరని ఆనందంగా చెప్పారు. కాగా రెండు గదులు, వంటగది, టాయిలెట్ సౌకర్యాలతో కూడిన ఈ ఫ్లాట్ కు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెప్పారు.

అతీక్ అహ్మద్ హత్య అనంతరం అతని కబ్జా భూమి సహా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. జప్తు చేసిన భూమిలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన నిరుపేదలకు జూన్ 9న 76 ప్లాట్‌లను కేటాయించింది ప్రభుత్వం. అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆడిటోరియంలో కేటాయింపుల కోసం లాటరీ తీశారు. మొత్తం 6,030 మంది దరఖాస్తు చేసుకోగా, వెరిఫికేషన్ తర్వాత 1,530 మంది లాటరీలో పాల్గొనడానికి అర్హులుగా గుర్తించారు. ఆ తర్వాత లాటరీ ద్వారా ఎంపిక చేశారు.

ప్రయాగ్ రాజ్ లోని లుకర్ గంజ్ లో అతీక్ అహ్మద్ బ్రతికున్నప్పుడే జప్తు చేసిన 1,731 చదరపు మీటర్ల స్థలంలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టారు. 2021 డిసెంబర్ 26న సీఎం యోగి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును పీఎంఏవై కింద జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టింది. రెండు బ్లాకులలో 76 ప్లాట్లను నిర్మించారు.

More Telugu News