habits: ఈ ఐదు హ్యాబిట్స్ మీకు ఉంటే.. మంచి ఆరోగ్యం సొంతం

  • నిత్యం వ్యాయామాలు చేయాల్సిందే
  • పోషకాహారం తీసుకోవాలి
  • ప్రతి రోజూ 7-9 గంటల పాటు నాణ్యమైన నిద్ర
  • ఒత్తిడి ఎక్కువ కాకుండా చర్యలు తీసుకోవాలి
Top 5 habits that will keep you young and healthy forever

ఆరోగ్యంగా ఉండాలని కోరుకోని వారు ఉండరు. కానీ, మిగతా విషయాల పట్ల ఉన్న శ్రద్ధ ఆరోగ్యం విషయంలో చూపించరు. దీంతో క్రమంగా ఆరోగ్యానికి నష్టం జరుగుతుంటుంది. నడి వయసుకే ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు రావడం సహజం. 

కానీ 30-40 ఏళ్లకే ఆరోగ్యం విషయంలో సమస్యలు రావడం అంటే కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. 30-40 ఏళ్లకే వృద్ధాప్యపు ఛాయలు రాకూడదని కోరుకుంటే, 50 ఏళ్లు దాటినా నడి వయసు వారి మాదిరే యవ్వనంగా కనిపించాలంటే అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే కొన్ని చర్యలను పాటించాల్సి ఉంటుంది. వృద్ధాప్యంలో కణాలు దెబ్బతినడం, క్షీణించడం మొదలవుతుంది. కణాల మధ్య మెరుగైన కమ్యూనికేషన్ ప్రక్రియ బలహీనపడుతుంది. కొన్ని చర్యల ద్వారా ఈ ప్రక్రియలను నిలువరించామంటే యవ్వనంగా ఉండొచ్చు.

  • రోజువారీ వ్యాయామాలు జీవన విధానంలో భాగం చేసుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు, రోజుకు 30-45 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్ వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు ఏవైనా కావచ్చు. ముఖ్యంగా గుండె బలపడడానికి వ్యాయామాలు ఉంటాయి. వాటిని కూడా చేయాలి.
  • ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదో ఒకటి లేదంటే రుచికరమైనది తినేశామంటే కుదరదు. తీసుకునే ఆహారం ఏదైనా కానీ, అందులో పోషకాలు ఉండాలి. ముడి ధాన్యాలు, తృణ ధాన్యాలు, కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. అదే సమయంలో చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్ తీసుకోకూడదు.
  • ఇక నాణ్యమైన నిద్ర చాలా అవసరం. రోజులో 7 నుంచి 9 గంటల వరకు నిద్ర పోవచ్చు. కాకపోతే ఈ నిద్ర కూడా కలత నిద్ర అవ్వకూడదు. అవాంతరాల్లేని నాణ్యమైన, గాఢనిద్ర అవ్వాలి. ఇందు కోసం నిద్రకు గంట ముందు నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించకూడదు. పడకగదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. నిద్రకు, రాత్రి భోజనానికి మధ్య 2 గంటల విరామం ఉండాలి.
  • ఒత్తిడి లేకుండా చూసుకోవడం కూడా ఆరోగ్యం పరంగా అత్యంత అవసరం. ఒత్తిడి ఎక్కువైపోతే కణాలకు నష్టం జరుగుతుంది. మధుమేహం, బీపీ, కేన్సర్, గుండె జబ్బుల వంటి సమస్యలు స్ట్రెస్ వల్ల వస్తాయని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ఆదుర్దాగా కాకుండా కాస్త నిదానంగా పనులు చేసుకోవడం, సమయానికి ముందుగానే బయల్దేరడం, మెడిటేషన్, యోగాసనాలు స్ట్రెస్ నుంచి విముక్తి కల్పిస్తాయి.
  • ఇక సామాజిక సంబంధాలు కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రభావం చూపిస్తాయి. మంచి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపాలి.

More Telugu News