Prakasam District: రివాల్వర్‌తో బెదిరించి వివాహితతో సచివాలయ ఉద్యోగి అసభ్య ప్రవర్తన.. స్తంభానికి కట్టేసి చితకబాదిన గ్రామస్థులు

Village Secretariat Employee Arrested After Misbehave With Woman
  • ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఘటన
  • అర్ధరాత్రి వివాహిత ఇంటికెళ్లి తుపాకితో బెదిరింపు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ గ్రామంలో సచివాలయ ఉద్యోగి తుపాకితో హల్‌చల్ చేశాడు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని పట్టుకున్న గ్రామస్థులు స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. కొమరోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి పాలుగుళ్ల మోహన్‌రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజుపాలెం సచివాలయంలో పశుసంవర్థక సహాయకుడిగా చేరాడు. 

విభేదాల కారణంగా భర్తతో దూరంగా ఉంటున్న ఓ వివాహితతో అతడికి పరిచయమైంది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు తొలగిపోయి భార్యాభర్తలు ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఆమె మోహన్‌రెడ్డితో మాట్లాడడం తగ్గించింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. 

ఇవి చూసిన ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో పగ పెంచుకుని బుధవారం అర్ధరాత్రి వివాహిత ఇంటికి వెళ్లి రివాల్వర్‌తో బెదిరించాడు. దీంతో గ్రామస్థులు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. మోహన్‌రెడ్డి నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam District
Secretaiat Employee
Crime News
Andhra Pradesh

More Telugu News