Balakrishna: నాకూ, ఆయనకూ రాజకీయాలు తెలియవు: సినీ నటుడు బాలకృష్ణ

  • ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలయ్య
  • సినిమా నిర్మాత డా. రసమయి బాలకిషన్‌, హీరో జగపతిబాబుపై ప్రశంసలు
  • కాలం మరిందని వ్యాఖ్య
  • ప్రస్తుతం తాము పరిశ్రమ మనుగడ కోసం సినిమాలు చేస్తున్నామన్న బాలయ్య
nandamuri balakrishna in rudrangi pre release event

తనకూ, రసమయి బాలకిషన్‌కు రాజకీయాలు తెలియవని ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. జగపతిబాబు ప్రధాన పాత్రలో డా. రసమయి బాలకిషన్ నిర్మించిన ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మనుగడ కోసం సినిమాలు చేసే కాలం గడిచిపోయిందని జగపతి బాబును ఉద్దేశిస్తూ బాలయ్య అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మనుగడ కోసమే తాము సినిమాలు చేస్తున్నామని చెప్పారు. 

‘‘రసమయి బాలకిషన్ నా సోదరుడి లాంటివారు. నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ రాజకీయాలు తెలియవు. ఆయనను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కథ, పాత్రల్లో ప్రేక్షకులు లీనమయ్యేలా చేసే అరుదైన చిత్రాల్లో ‘రుద్రంగి’ కూడా ఒకటి’’ 

‘‘నటన అంటే ఎంపిక చేసుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం. క్యారెక్టర్లలో జీవించడం గొప్ప.. నటించడం కాదు. టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటుడు మా జగపతిబాబు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం మేం ఇండస్ట్రీ మనుగడ కోసమే సినిమాలు చేస్తున్నాం’’ అని బాలయ్య తెలిపారు. 

‘రుద్రంగి’ సినిమాలో హీరో జగతిబాబుతో పాటూ ఆశిష్ గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జులై 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News