BRS: నరేంద్ర మోదీ కాజీపేట పర్యటనలో కోచ్ ఫ్యాక్టరీపై స్పందించాలి: వినోద్ కుమార్ డిమాండ్

  • కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేసిన వినోద్
  • కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయని వ్యాఖ్య
  • కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందన్న వినోద్
BRS leader Vinod Kumar demand kazipet coach factory

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 ఏళ్ల డిమాండ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని, ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. గతంలో కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. జులై 8న ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేట పర్యటనలో కోచ్ ఫ్యాక్టరీపై స్పందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రైల్వే శాఖ మంత్రి ఏ ప్రాంత వాసి అయితే ఆ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీలు కేటాయించారని ఆరోపించారు.

కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. దానిని కాదని గతంలో వేరే రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారన్నారు. గత ఏడాది గుజరాత్ లో ఎన్నికల సందర్భంగా కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కాకుండా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వ్యాగన్లు శుభ్రం, మరమ్మతు చేసే ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రధాని రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

More Telugu News