TDP: 'జగన్‌ మోసపు లీలలు' పేరిట టీడీపీ వాస్తవపత్రం విడుదల!

  • వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశారనడం అవాస్తవమన్న అచ్చెన్నాయుడు
  • జగన్ అమలు చేసిన హామీలు 10 శాతం మాత్రమేనని వ్యాఖ్య 
  • తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని ఆరోపణ
atchannaidu pressmeet at mangalagiri party office

వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్‌ మోసపు లీలలు’ పేరిట టీడీపీ రూపొందించిన వాస్తవ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నవరత్నాల పేరుతో జగన్ ఇచ్చిన హామీలు తొమ్మిదైతే.. వాటికింద 40 హామీలు ఉన్నాయి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం. జగన్ అమలు చేసిన హామీలు 10 శాతం మాత్రమే. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారు” అని మండిపడ్డారు. 

జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని, ఒక్కటీ నిజం ఉండదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకటి చెప్పి.. అధికారంలోకి వచ్చాక మరొకటి చేస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రూ.13 వేలు ఇస్తారా? అని నిలదీశారు.

రాష్ట్రంలో 84 లక్షల మంది ఉంటే 42 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేయటం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘తల్లికి వందనం’ కార్యక్రమం తీసుకొచ్చి.. ప్రతి మహిళకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందుతోందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘‘మేం 74 లక్షల మందికి పింఛన్‌ ఇస్తే.. మీరు 62 లక్షల మందికే ఇస్తారా? వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల మందికి పింఛన్లు తొలగించడం వాస్తవం కాదా? ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారు” అని మండిపడ్డారు.

 వైఎస్సార్‌ జలయజ్ఞం కింద ఇచ్చిన హామీలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. మద్య నిషేధమంటూ ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రైతు భరోసా కింద 12 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. 

‘‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2 అమలు కాలేదు. అమ్మఒడి కింద ఇచ్చిన 2 హామీలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీలూ అమలు కాలేదు. బోధనారుసుం కింద ఇచ్చిన 2 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు” అని ఆరోపించారు.

More Telugu News