Punjab: రూ. 4 కోట్ల బీమా కోసం ఘాతుకం.. స్నేహితుడిని చంపేసి తానే చనిపోయినట్టు నమ్మించి.. డ్రామా ఆడిన యువకుడు!

  • పంజాబ్‌లో ఘటన
  • వ్యాపారంలో జరిగిన నష్టం నుంచి బయటపడేందుకు ప్లాన్
  • భార్య, మరో నలుగురు స్నేహితులతో కలిసి అమలు
  • స్నేహితుడికి మద్యం తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత తన దుస్తులు తొడిగి ట్రక్కు కింద తోసి హత్య
  • కటకటాలు లెక్కపెట్టుకుంటున్న నిందితులు
Punjab man kills friend fakes own death to claim Rs 4 crore insurance payout

మానవ జీవితాల్లో ప్రధానంగా మారిన డబ్బు మనుషులను కిరాతకంగా మార్చుతోందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి తన పేరున ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును కొట్టేసేందుకు ప్లాన్ చేశాడు. స్నేహితుడిని దారుణంగా చంపేసి ఆపై తానే చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. పంజాబ్‌లో జరిగిందీ ఘటన. హతుడు సుఖ్‌జీత్ సింగ్ భార్య జీవన్‌దీప్ కౌర్ కనిపించడం లేదన్న ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్‌సింగ్, ఆయన భార్య ఖుష్‌దీప్ సింగ్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వ్యాపారంలో నష్టపోయిన గురుప్రీత్ తన భార్య మరో నలుగురు.. సుఖ్విందర్ సింగ్ సంగ్త, జస్పాల్ సింగ్, దినేశ్ కుమార్, రాజేశ్‌కుమార్‌తో కలిసి సుఖ్‌జీత్ హత్యకు కుట్ర పన్నాడు. అతడిని చంపి తానే చనిపోయినట్టు నమ్మించడం ద్వారా తన పేరున ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును సొంతం చేసుకుని అప్పుల నుంచి బయటపడాలని పథకం వేశాడు. 

సుఖ్‌జీత్‌ను చంపే ఉద్దేశంతో గురుప్రీత్ అతడితో స్నేహం చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 19న సుఖ్‌జీత్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పాటియాలా రోడ్డులోని ఓ కాలువ వద్ద సుఖ్‌జీత్ మోటార్ సైకిల్, చెప్పులను గుర్తించారు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. 

మరోవైపు, గుర్‌ప్రీత్ కొన్ని రోజులుగా తన భర్త కోసం మద్యం కొంటున్నట్టు సుఖ్‌జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీంతో ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వారి సమాధానంతో అనుమానించిన పోలీసులు గురుప్రీత్ కుటుంబ సభ్యులను మరోమారు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ నాటకం ఆడారని, గురుప్రీత్ బతికే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. 

మరోవైపు, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు రాజ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 20న ఫిర్యాదు చేసినట్టు తేలింది. అంతకుముందు రోజులు సుఖ్‌జీత్‌ను మద్యం మత్తులో ముంచి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడి దుస్తులు విప్పి తాను వేసుకుని, తన దుస్తులను అతడికి తొడిగాడు. ఆపై ట్రక్కు కిందకి తోసి ఎవరూ గుర్తు పట్టకుండా నుజ్జునుజ్జు చేశాడు. చివరికి విషయం వెలుగులోకి రావడంతో అందరూ జైలుపాలయ్యారు.

More Telugu News