France: ఆఫ్రికా టీనేజర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. ఫ్రాన్స్‌లో విధ్వంసం

  • 17 ఏళ్ల డెలివరీ వాహన డ్రైవర్‌ను అనుమానంతో కాల్చి చంపిన పోలీసులు
  • పోలీస్ స్టేషన్లపైకి టపాసులు విసురుతూ, కార్లను తగలబెడుతున్న ఆందోళనకారులు
  • పోలీసుల కాల్పులను వివరించలేని, క్షమించరాని చర్యగా అభివర్ణించిన అధ్యక్షుడు మాక్రాన్
Clashes and torched cars in France over police killing of African teen

ఉత్తర ఆఫ్రికా జాతీయుడైన 17 ఏళ్ల టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపడంపై ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. పారిస్‌ శివారులోని నాంటెర్రిలో ట్రాఫిక్ స్టాప్ ప్రాంతంలో కుర్రాడిని పోలీసులు కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్‌పై టపాసులు విసిరిన నిరసనకారులు కార్లకు మంటపెట్టారు. వరుసగా రెండో రాత్రి కూడా అల్లర్లు కొనసాగాయి. 

ఆందోళనకారులను అడ్డుకునేందుకు లిల్లీ, టౌలౌస్ నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అమీన్స్, డిజోన్, ఎస్సోలోనూ అశాంతి నెలకొంది. పారిస్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరుగుతున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. పారిస్ తూర్పు దిక్కున ఉన్న మాంట్రూయిల్ టౌన్ హాల్‌పైకి నిరసనకారులు డజన్ల కొద్దీ టపాసులను విసురుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

టీనేజర్‌పై పోలీసుల కాల్పులను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్.. వివరించలేని, క్షమించరానివిగా పేర్కొన్నారు. నాంటెర్రిలో మంగళవారం ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా 17 ఏళ్ల నయెల్ అనే డెలివరీ వాహన డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  

ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. 40కిపైగా కార్లను ఆందోళనకారులు దహనం చేశారు. మరోవైపు, కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు. అతడిపై హత్యాభియోగాలు మోపారు. అలాగే, అల్లర్లకు పాల్పడిన 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News