Karnataka: బియ్యం సరఫరాకు ఎవరూ ముందుకు రావడం లేదు.. డబ్బులిస్తాం: కర్ణాటక ప్రభుత్వం

Karnataka government to give money instead of 5 kg additional rice
  • ఎన్నికల సమయంలో 'అన్నభాగ్య' హామీ ఇచ్చిన కాంగ్రెస్
  • బియ్యం సేకరణ సాధ్యం కావడంలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • కిలోకు రూ.34 చొప్పున కట్టిస్తామని వెల్లడి

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఐదు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఒకటైన 'అన్నభాగ్య' పథకాన్ని జులై 1వ తేదీ నుండి అమలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని తెలిపింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోలకు సమానమైన మొత్తాన్ని బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి మునియప్ప మీడియాకు తెలిపారు. ఎఫ్‌సీఐ ప్రకారం కిలో బియ్యానికి రూ.34గా ఉందని, అయితే బీపీఎల్ ఖాతాదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు తాము విశ్వప్రయత్నాలు చేశామని, కానీ మన రాష్ట్రానికి అవసరమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఏ సంస్థా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఇక 'అన్నభాగ్య' పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాల్సి ఉందని, బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేమని, కాబట్టి ఇందుకు సమానమైన మొత్తాన్ని ఇస్తామని తెలిపారు.

కిలోకు రూ.34 చొప్పున చెల్లిస్తామని, జులై 1 నుండి ఈ నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340 చెల్లిస్తామని ప్రకటించారు. 'అన్నభాగ్య' పథకం కింద కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News