Phil Stringer: ఒక్కడి కోసం విమానం నడిపారు... ఎందుకంటే...!

  • అమెరికాలో ఘటన
  • ఓక్లహామా నుంచి నార్త్ కరోలినా వెళ్లాల్సిన విమానం
  • అనుకోని కారణాలతో విమానం 18 గంటల ఆలస్యం
  • అంతసేపూ వెయిట్ చేసిన ఒకే ఒక్క ప్రయాణికుడు
  • కేవలం అతడి కోసమే ఓక్లహామా నుంచి నార్త్ కరోలినా ప్రయాణించిన విమానం
Flight service for only one person

అమెరికాలో ఓ వ్యక్తికి అద్భుతమైన ఆఫర్ లభించింది. విమానంలో ఫస్ట్ క్లాస్ లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. 

ఓక్లహామా సిటీ నుంచి నార్త్ కరోలినా వెళ్లాల్సిన విమానం బాగా ఆలస్యమైంది. విమానం బయల్దేరేందుకు 18 గంటల సమయం పడుతుందని ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపారు. దాంతో, ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుని నార్త్ కరోలినా వెళ్లిపోయారు. 

అయితే ఒక్కడు మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా 18 గంటల పాటు ఓపిగ్గా కూర్చున్నాడు. అతడి పేరు ఫిల్ స్ట్రింగర్. అతడి ఓపిక బంపర్ చాన్స్ తెచ్చిపెట్టింది. ఇతర ప్రయాణికులు వెళ్లిపోయినా, ఆ ఒక్కడు మాత్రమే ఉన్నప్పటికీ, అతడి కోసం విమానం నడపాలని సదరు ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. అంతేకాదు, అతడిని పూర్తి ఉచితంగా, ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టి మరీ నార్త్ కరోలినా తీసుకెళ్లారు. 

వెయిటింగ్ టైమ్ ముగిశాక విమానంలో ఎక్కేందుకు వెళ్లిన ఫిల్ స్ట్రింగర్ ఆశ్చర్యపోయాడు. టెర్మినల్ గేటు వద్ద ఎవరూ లేకపోవడంతో, అందరినీ విమానంలోకి పంపించారా అని అక్కడున్న సిబ్బందిని అడిగాడు. దాంతో వారు స్పందిస్తూ, ప్రయాణికులు వేరే ప్రత్యామ్నాయాలు చూసుకున్నారని, మీరొక్కరే దీంట్లో ప్రయాణించబోతున్నారు అంటూ స్ట్రింగర్ కు చెప్పారు. 

అప్పటికీ స్ట్రింగర్ కు నమ్మశక్యం కాలేదు. విమానంలోకి వెళ్లి చూస్తే నిజంగానే ఎవరూ లేరు. అయితే తన ఒక్కడి కోసం విమానం నడపడం సరికాదేమోనన్న భావన కలిగిందని స్ట్రింగర్ ఆ తర్వాత సోషల్ మీడియాలతో తన విమాన ప్రయాణ అనుభవాలను పంచుకున్నాడు. తనను సంతోషంగా ఉంచేందుకు ఆ విమాన సిబ్బంది ప్రయత్నించారని, తనకు పార్టీ కూడా ఇచ్చారని వెల్లడించాడు. ఇదొక మరపురాని అనుభవం అని పేర్కొన్నాడు.

More Telugu News