Narendra Modi: ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ కీలక వ్యాఖ్యలు.. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసర సమావేశం

All India Muslim Personal Law Board emergency meeting after Modis comments on Common Civil Code
  • ఒకే దేశంలో రెండు చట్టాలు పని చేయవన్న మోదీ
  • అందరికీ సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెపుతోందని వ్యాఖ్య
  • కామన్ సివిల్ కోడ్ పై త్వరలోనే డ్రాఫ్ట్ బిల్లును తీసుకురానున్న కేంద్రం
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భోపాల్ లో బీజేపీ పార్టీ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఒకే దేశంలో రెండు రకాల చట్టాలు పని చేయవని అన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం చెపుతోందని... ఉమ్మడి చట్టాలు ఉండాలని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పిందని గుర్తు చేశారు. దేశంలోని రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని... ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలను బీజేపీ చేయదని స్పష్టం చేశారు. 

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక న్యాయం, మరొక వ్యక్తికి మరో న్యాయం ఉంటాయా? అని మోదీ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటే ఆ కుటుంబం మనుగడ సాగించగలదా? అని అడిగారు. ఇలాంటి ద్వంద్వ విధానం ఉంటే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగంలో కూడా అందరికీ సమాన హక్కులు ఉంటాయనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. విపక్షాలు ఎప్పుడూ ముస్లిం జపం చేస్తుంటాయని... నిజంగా ముస్లింలపై వారికి అంత నిజమైన ప్రేమ ఉంటే ముస్లింలు విద్య, ఉద్యోగాల విషయంలో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. 

మరోవైపు, ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి న్యాయపరమైన కోణంలో ఏం చేయవచ్చనే దానిపై వీరు చర్చించారు. లాయర్లు, న్యాయశాస్త్ర నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలను లా కమిషన్ కు అందించాలని వీరు నిర్ణయించారు. 

ఉమ్మడి పౌరస్మృతిపై కొత్తగా సంప్రదింపుల ప్రక్రియను ఇటీవలే లా కమిషన్ ప్రారంభించింది. వివిధ మతాల పెద్దల నుంచి అభిప్రాయాలను సేకరించే ప్రక్రియను మొదలుపెట్టింది. కామన్ సివిల్ కోడ్ కు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును తీసుకురానున్న నేపథ్యంలో... లా కమిషన్ ఈ ప్రక్రియను ప్రారంభించింది.
Narendra Modi
BJP
Common Civil Code
All India Muslim Personal Law Board

More Telugu News