Hyderabad: హైదరాబాద్​ అభిమానులకు ఊరట.. రెండు వరల్డ్​ కప్​ ప్రాక్టీస్​ మ్యాచ్​ల కేటాయింపు

  • వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
  • హైదరాబాద్ కు టీమిండియా మ్యాచ్ ఇవ్వకపోవడంపై విమర్శలు
  • మూడు ప్రధాన మ్యాచ్ లకు తోడు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల 
    ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ
World 2023 Warm up Schedule out Hyderabad host  two matches from Sep 29

భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ, బీసీసీఐ విడుదల చేశాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీకి దేశంలోని పది నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో హైదరాబాద్ మినహా తొమ్మిది నగరాల్లో భారత్ ఆడనుంది. ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే టీమిండియా ఆడే మ్యాచ్‌ను కేటాయించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే, మిగతా తొమ్మిది స్టేడియాలకు ఐదేసి మ్యాచ్‌ల చొప్పున ఇచ్చిన ఐసీసీ.. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియానికి మూడు మ్యాచ్‌లే కేటాయించింది. పాకిస్థాన్ జట్టు అక్టోబర్ 6,12వ తేదీల్లో క్వాలిఫయర్ జట్లతో ఆడే రెండు మ్యాచ్‌లు, న్యూజిలాండ్ అక్టోబర్9వ తేదీన క్వాలిఫయర్‌‌ తో ఆడే మరో మ్యాచ్‌ మాత్రమే ఉప్పల్‌లో జరగనుంది. 

దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో బీసీసీఐ, ఐసీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రపంచ కప్ నకు ముందు సెప్టెంబర్ 29 నుంచి జరిగే వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ ను వేదికగా ఎంపిక చేసింది. హైదరాబాద్ తో పాటు గువాహతి, తిరువనంతపురం నగరాలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ కు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను కేటాయించింది. సెప్టెంబర్ 29న పాకిస్థాన్ – న్యూజిలాండ్, అక్టోబర్ 3న పాకిస్థాన్–ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ లో ప్రాక్టీస్ మ్యాచ్‌ లు జరుగుతాయి. మొత్తంగా మూడు ప్రధాన, రెండు ప్రాక్టీస్ సహా ఉప్పల్ స్టేడియం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

More Telugu News