Pawan Kalyan: తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

  • గతేడాది పోలీస్ రిక్రూట్ మెంట్ టెస్టు నిర్వహించిన తెలంగాణ సర్కారు
  • 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటున్న అభ్యర్థులు
  • ఇవాళ పవన్ ను భీమవరంలో కలిసిన తెలంగాణ యువకులు
  • యువకుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్న పవన్
  • ట్విట్టర్ లో సీఎంవో, కేటీఆర్ లను ట్యాగ్ చేస్తూ ప్రకటన
Pawan Kalyan appeals Telangana govt to look into Police recruitment test mistakes in questions

తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ టెస్టులో కొన్ని ప్రశ్నలు తప్పుగా రావడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.  

పరీక్ష కీ విడుదల చేసినప్పుడే అభ్యంతరాలు చెప్పినా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని తెలంగాణ నుంచి కొందరు అభ్యర్థులు ఇవాళ తనను భీమవరంలో కలిసి విజ్ఞాపన పత్రం అందించారని పవన్ వివరించారు. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలు చెబుతూ ప్రామాణిక పుస్తకాలను ఆధారాలుగా చూపినా పరిగణించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారని వెల్లడించారు. దాంతోపాటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశాన్ని కూడా తన దృష్టికి తీసుకువచ్చినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. 

"పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు విలువైనదే. తమ జీవితాలను ఆ ఒక్క మార్కు మార్చుతుందని తెలంగాణ నుంచి వచ్చిన ఆ యువకులు ఆందోళనతో చెప్పారు. వీరి అభ్యంతరాలను, ఆవేదనను సానుకూల దృక్పథంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన పోస్టుకు తెలంగాణ సీఎంవో, కేటీఆర్ లను ట్యాగ్ చేశారు.

More Telugu News