HDFC Bank: జులై 1 నుంచి హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ విలీన ప్రక్రియ

  • గతేడాది ఏప్రిల్ 4న ఒప్పందం
  • హెచ్ డీఎఫ్ సీని టేకోవర్ చేస్తున్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు
  • ఒప్పందం విలువ 40 బిలియన్ డాలర్లు
HDFC and HDFC Bank merger comes effective from July 1

గృహ రుణాల దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ, ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీనానికి సర్వం సిద్ధమైంది. వీటి విలీన ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందించారు. జూన్ 30న హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బోర్డులు సమావేశం కానున్నాయని, విలీనంపై లాంఛనంగా ఆమోద ముద్ర వేస్తాయని పరేఖ్ వెల్లడించారు. 

ఇక హెచ్ డీఎఫ్ సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ స్పందిస్తూ, నూతనంగా ఏర్పడే సంస్థ స్టాక్ డీలిస్టింగ్ జులై 13 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 

హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మధ్య గతేడాది ఏప్రిల్ 4న జరిగిన విలీన ఒప్పందం భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలుస్తుంది. హెచ్ డీఎఫ్ సీని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ టేకోవర్ చేసేందుకు కుదిరిన ఒప్పందం విలువ 40 బిలియన్ డాలర్లు (రూ.3.27 లక్షల కోట్లు). కొత్తగా ఏర్పడే సంస్థ రూ.18 లక్షల కోట్ల వ్యవస్థాపక సంపద కలిగి ఉండనుంది. 

ఈ ఒప్పందం కార్యరూపం దాల్చిన అనంతరం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 100 శాతం వాటాదారుల పరం కానుంది. అదే సమయంలో, హెచ్ డీఎఫ్ సీలో ఇప్పటికే ఉన్న వాటాదారులు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 41 శాతం వాటాను పొందుతారు. విలీనం అనంతరం... హెచ్ డీఎఫ్ సీ వాటాదారులు ప్రతి 25 షేర్లకు గాను 42 హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లు పొందుతారు.

More Telugu News