India: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చింది సరే... పాక్ జట్టు భారత్ లో అడుగుపెట్టేనా?

Uncertainity looms over India and Pakistan world cup match
  • వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
  • అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు మెగా ఈవెంట్
  • వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం
  • తమ ప్రభుత్వం అనుమతిస్తేనే వస్తామంటున్న పీసీబీ
భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 48 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. 46 రోజుల పాటు భారత్ లోని వివిధ వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. 

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ వరల్డ్ కప్ భారత్ లో జరుగుతున్నందున పాకిస్థాన్ జట్టు వస్తుందా, రాదా అనే సందేహాలు నెలకొన్నాయి. 

రాజకీయ కారణాల నేపథ్యంలో భారత జట్టు చాలాకాలంగా పాకిస్థాన్ లో పర్యటించడంలేదు. దాంతో భారత్ లో జరిగే ఈవెంట్లకు తాము రాబోమని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరల్డ్ కప్ భారత్ లోనే జరగనుండగా, షెడ్యూల్ కూడా వచ్చేసింది. 

కానీ భారత్ లో తాము ఆడేది లేనిదీ తమ దేశ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్ లో వరల్డ్ కప్ ఆడతామని స్పష్టం చేసింది. అయితే ఐసీసీ మాత్రం పాకిస్థాన్ జట్టు భారత్ లో ఆడేందుకు తప్పకుండా వస్తుందని ధీమాగా చెబుతోంది.
India
Pakistan
World Cup
ICC

More Telugu News