KCR: తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?: కేసీఆర్

  • తాను ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదన్న బీఆర్ఎస్ చీఫ్
  • మహారాష్ట్రలోని సర్కోలీలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగం
  • బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని వెల్లడి
If development possible in telangana then why not in maharashtra asks KCR

కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటిది అన్ని వనరులు పుష్కలంగా ఉన్న మహారాష్ట్ర మాత్రం అభివృద్ధిలో వెనుకబడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.

మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రైతులంతా బీఆర్ఎస్ తో ఉంటే మిగతా పార్టీలే మనకు బీ టీమ్ లుగా మారుతాయని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కేసీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన భాజాపా.. అందరికీ మీరు అవకాశం ఇచ్చారని చెప్పారు. రైతులకు మంచి చేయాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే వీళ్లలో ఎవరైనా చేయగలిగే వారని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేని వాళ్లకు అధికారం కట్టబెట్టొద్దని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని పేర్కొన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ముందుకు వెళుతున్నామని కేసీఆర్ చెప్పారు.

More Telugu News