Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీషాకి భారీ ఊరట

  • సప్నాగిల్ పై లైంగిక వేధింపులు నిజం కాదన్న పోలీసులు
  • అందుకు ఆధారాల్లేవంటూ అంధేరీ కోర్టుకు నివేదిక
  • సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని ఆదేశించిన కోర్టు
Influencers molestation claims against cricketer Prithvi Shaw false Mumbai Police tells court

ప్రముఖ క్రికెటర్ పృథ్వీ షాకి భారీ ఊరట లభించింది. పృథ్వీషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సామాజిక మాధ్యమ ప్రభావ శీలి సప్నాగిల్ లోగడ ఆరోపణలు చేయడం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఓ పబ్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సప్నాగిల్ ఆరోపణలు నిజం కావని, అందుకు ఆధారాల్లేవని పోలీసు అధికారి ముంబైలోని అంధేరీ కోర్టుకు తెలిపారు. 

పృథ్వీషాకి వ్యతిరేకంగా తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎయిర్ పోర్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ సప్నాగిల్ ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. పృథ్వీషాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె కోర్టును కోరింది. దీంతో నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ లోగడ పోలీసులను ఆదేశించారు. పోలీసులు తాజాగా సప్నాగిల్ ఆరోపణల్లో నిజం లేదంటూ కోర్టుకు నివేదిక ఇచ్చారు. 

దీంతో సప్నా గిల్ తన ఫోన్ లో రికార్డు చేసిన  నాటి ఘటన తాలూకూ వీడియోని కోర్టుకు సమర్పించేందుకు అనుమతించాలని సప్నాగిల్ తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ కావడం గమనించొచ్చు.  దీంతో నాటి ఘటనకు సంబంధించి మొత్తం వీడియో ఫుటేజీ సమర్పించాలని పోలీసులను మేజిస్ట్రేట్ ఆదేశిస్తూ విచారణను జూన్ 28కి వాయిదా వేశారు.

More Telugu News