Hackers: భారత సైన్యం సహా అత్యున్నత విద్యాసంస్థలను టార్గెట్ చేసిన పాకిస్థాన్ హ్యాకర్లు

  • రక్షణ శాఖతో పాటు ఐఐటీలు, ఎన్ఐటీలపై సైబర్ దాడులు
  • బిజినెస్ స్కూళ్లను కూడా వదలని పాక్ హ్యాకర్లు
  • కీలక సమాచారంపై కన్నేసిన ట్రాన్స్ పరెంట్ ట్రైబ్, సైడ్ కాపీ గ్రూపులు
Pakistan Hackers eyes on Indian defense and top educational institutions

పాకిస్థాన్ హ్యాకర్లు భారత సైన్యం, అత్యున్నత విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు భారత సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్ల బృందం ట్రాన్స్ పరెంట్ ట్రైబ్, దాని అనుబంధ సంస్థ సైడ్ కాపీ... ఈ రెండు గ్రూపులు భారత రక్షణ శాఖ, ఐఐటీలు, ఎన్ఐటీలు, బిజినెస్ స్కూళ్ల కంప్యూటర్ వ్యవస్థలపై దాడులు చేసినట్టు గుర్తించారు. 

పాక్ గూఢచారుల హనీ ట్రాప్ లో చిక్కుకుని డీఆర్డీఓ శాస్త్రవేత్త ఒకరు కీలక సమాచారం లీక్ చేసి అరెస్టయ్యాడు. ఈ అరెస్ట్ తర్వాత హ్యాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. 

ట్రాన్స్ పరెంట్ ట్రైబ్ హ్యాకర్ల బృందం 2022 నుంచి భారత్ లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలపై కన్నేసి దాడులకు పాల్పడుతోందని భారత సైబర్ నిపుణులు వివరించారు. ఈ సైబర్ దాడులు 2023 మొదటి త్రైమాసికంలో మరింత తీవ్రతరం అయ్యాయని తెలిపారు. 

అయితే పేరెన్నికగన్న ఈ విద్యాసంస్థలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది తెలియడంలేదని వెల్లడించారు. ఈ విద్యాసంస్థల్లో కొన్ని భారత రక్షణ శాఖతో కొన్ని ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్నందునే వీటిని హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

భారత సంస్థలపై దాడుల కోసం పాకిస్థానీ హ్యాకర్లు లినక్స్ మాల్వేర్ పోసిడాన్ ను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. బింజ్ చాట్, చాటికో వంటి కొన్ని చాటింగ్ యాప్స్ ద్వారా గ్రావిటీ ర్యాట్ ట్రోజన్ వంటి ప్రమాదకర వైరస్ లతోనూ హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతం నుంచి కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఈ గ్రావిటీ ర్యాట్ ట్రోజన్ వైరస్ తో వాట్సాప్ బ్యాకప్ ఫైళ్లను సైతం డిలీట్ చేయవచ్చట. 

సాధారణంగా ఈమెయిళ్లు, యూఆర్ఎల్స్ ద్వారా హ్యాకర్లు ప్రమాదకర వైరస్ లను కంప్యూటర్లలో చొప్పిస్తుంటారు. పాకిస్థానీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు తమ టెక్నిక్ లను మార్చుతూ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఏమార్చుతున్నట్టు గుర్తించారు. భారత్ నుంచి కీలక సమాచారం సేకరించి పాకిస్థాన్ కు అందజేయడమే ఈ హ్యాకర్ల లక్ష్యం అని భావిస్తున్నారు.

More Telugu News