Kamal Haasan: ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్ కు కారు ఇవ్వనున్న కమలహాసన్

  • కోయంబత్తూరులో మహిళా డ్రైవర్ గా గుర్తింపు పొందిన షర్మిల
  • ఇటీవల షర్మిల బస్సులో ప్రయాణించిన ఎంపీ కనిమొళి
  • వాచ్ ను షర్మిలకు కానుకగా ఇచ్చిన కనిమొళి
  • ట్రైనీ కండక్టర్ పై యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన లేడీ డ్రైవర్
  • లేడీ డ్రైవర్ నే ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
Kamal Haasan will gift a car to woman driver

ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి కోయంబత్తూరులో స్థానికంగా ఓ బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో బస్సును నడిపింది షర్మిల అనే మహిళా డ్రైవర్. ఆ మహిళా డ్రైవర్ డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్న కనిమొళి ఆమెకు వాచ్ ను బహూకరించారు. 

కాగా, తన బస్సులో విధుల్లో ట్రైనీ కండక్టర్ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందని మహిళా డ్రైవర్ షర్మిల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే, సెలబ్రిటీలను తన బస్సులో ప్రయాణించాలని ఆహ్వానిస్తూ సాధారణ ప్రయాణికులను షర్మిల ఇబ్బందిపెడుతోందంటూ ఆ కండక్టర్ కూడా మహిళా డ్రైవర్ పై ఆరోపణలు చేసింది. 

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బస్సు యాజమాన్యం చివరికి లేడీ డ్రైవర్ షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా, ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్ షర్మిలకు ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ అండగా నిలిచారు. ఆమెకు ఓ కారును కానుకగా ఇస్తున్నట్టు వెల్లడించారు. 

కమల్ సాంస్కృతిక కేంద్రం తరఫున కారును అందజేస్తున్నట్టు వివరించారు. షర్మిల ఇప్పటివరకు ఉద్యోగిగా ఉందని, ఇకపై ఆమె మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని కమల్ తెలిపారు. 

కోయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్ గా పేరుగాంచిన షర్మిల విషయంలో ఇలా జరగడం తనను బాధించిందని కమల్ తెలిపారు. మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆమె కేవలం ఓ డ్రైవర్ గా మిగిలిపోకూడదని భావిస్తున్నానని, ఆమె మరెంతో మంది షర్మిలలను సృష్టించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

తాము అందించే కారును ఆమె క్యాబ్ సర్వీసులకే కాకుండా, మరెంతో మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కూడా ఈ కారును ఉపయోగించుకోవచ్చని కమల్ సూచించారు.

మహిళా డ్రైవర్ షర్మిలను, ఆమె కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ఆహ్వానించిన కమల్... వారితో ఆత్మీయంగా మాట్లాడారు. షర్మిల వంటి మహిళలు ఈ తరానికి అవసరం అని కొనియాడారు.

More Telugu News